శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్ విజయ గోలి
కడలి మునిగి సూరీడూ కలల పడవ తేలేనులె
నిశి కన్నుల దోబూచుల నెలరాజే ఏలేనులె
చిరు తారల వెలుగులలో తేనె తీపి జ్ఞాపకాలు
వెండి మొయిలు తెరలు తీసి వేడుకగా నిలిచేనులె
వలపు వనం విరబూస్తే ఆనందపు ఝంకారమె
గాలిఅలల గమకాలతొ ప్రణయపదం పాడేనులె
చేరువలో లేకున్నా చెరిసగమై ప్రేమేగా
గుడి గంటల ప్రణవముగా గుండెలోన దాగేనులె
తనివితీరు తలపులతో తన్మయాల విజయంలో
విరహాలకు దరహాసపు వన్నెలద్ది మురిసేనులె