గజల్ * విజయ గోలి
ఒక్కసారి పలుకరించి చెలిమిపంచు తలపుకలిపి
ప్రేమపంట పండేందుకు మనసుపంచు వలపుకలిపి
మనసుతలుపు తట్టేందుకు వెనుకాడకు వెరపులతో
ఓరిమితో ఒకనిమిషం వెతనుపంచు జతనుకలిపి
విచ్చుకున్న పెదవివెనుక విప్పలేని భావాలను
ఒకటొకటిగ మదిలేఖగ వ్రాసిపంచు కలలుకలిపి
ఎదురుచూచు హృదయమే ఎదతడిపే జల్లుకొరకు
కురిసిపోవు మేఘముగా మమతపంచు మనసుకలిపి
మమతకోరు మనసెపుడూ మల్లెపూల తెల్లదనమే
వసివాడని పరిమళాల మత్తుపంచు బ్రతుకు కలిపి