*ఒంటరితనం విజయ గోలి
ఒక్కసారిగా చిన్నపిల్లై పోయింది
అనంత సాగరం అల్లరిగా
నను కవ్విస్తూ …వెంటబడీ
నా పాదాలను ముద్దాడుతుంది.
లాల పోస్తూ లాలి పాడే అమ్మలా
ఒంటరితనం వెంటేసుకెళ్లానేమో…
జంట నిలిచిన సంద్రాన్ని
హత్తుకోవాలనిపించింది
అలల రెక్కలు తొడిగి
అంబరం తాకాలి రమ్మంటూ
చిన్నారి నెయ్యం చేయి జాచింది
కడలి కెరటాలపై పరుచుకున్న
వెన్నెల నీడలు… మగ్గంపై
జలతారు జరీ చీరలా తోచింది
తారల తళుకులో తలపులు
మొగ్గ తొడిగిన వలపు విరులు
ఏకాంతం ఎలకోయిల
గొంతులో యుగళంగా మారింది
ఎగిరి పడే చేప పిల్లలా
మనసు మందసమై తుళ్ళింది
సముద్ర తీరపు గాలి సరసం మొదలెట్టింది
ప్రకృతి లో ఎక్కడా కనిపించని
ఒంటరి తనం మనిషి కెందుకు?
పంచ భూతాలతో పరవశించే… సృష్టి
జంటలతో జత కలిపింది… అయినా
ఆస్వాదించలేని ఆక్రందనగానే.. మనిషి
శుభోదయం 🌹🌹