ఎదురుచూపు విజయ గోలి
ఒంటరి తనమంటే
జంట మనసు కూడ
తోడు రాక పోవడమే
గతమంతా శూన్యమై
బ్రతుకు లేకపోవడమే
ఓపికుడిగి పోయాకె
నీకు నీవు తెలిసేది
నెర్రిలిచ్చిన నేలకు తెలుసు
నీ ముదిమికెంత వయసో
బీడుపడ్డ భూమికి తెలుసు
ఆ బంధమెంత గట్టిదో
అయ్యచేయి పట్టి
ఆభూమిన అడుగెట్టిన
నాటినుండి నేటివరకు
వయసంతా ఎదురుచూపు
వింతకధే నీ బ్రతుకు
ఎడారిలో మేఘంకై
వెతుకులాడి అలిసావు
కన్నీటితొ విత్తుతడిపి
కాలమంత చూసేవు
కరుణించని కాలానికి
దాసోహ మింకెందుకు
ఇకనైన ఆ తనువుకు
కూసింత విరామమివ్వు
ఎవరికొరకు ఎదురుచూపు
చూడకున్నా తరుముకొచ్చు
కోరని ఆ మృత్యువు