ఋణం విజయ గోలి
అన్నదాతా ..సుఖీభవ ..అందరి ఆశీస్సులు
ఎవరికందుతున్నాయి..ఎటు మళ్లుతున్నాయి
రెక్కలిరిచి అరక దున్ని ..నాటు వేసి కలుపు తీసి ..
అలుపు లేక పంట కాచి…ఆరుగాలం పడిన శ్రమకు ..
ఫలితమంటూ ..లేకుంటే ..
వరుణుడే చెప్పలేని ..తరుణోపాయం …ఎవరు చెప్పగలరు ..
నమ్మిన దళారీ ..నట్టేట్లో ముంచేస్తే..
ఆదుకుంటానన్న..రాజకీయం నీ మాటే మరిచింది.
పండించిన ..నీ ఇంట ..గంజి నీళ్లు కరువైతే ..
కంటినీరు..ఎన్నాళ్ళు కడుపు నింపుతుంది ..
ఆశగా ఎదురు చూసే ..ఆరు జతల కళ్ళకు ..
ఆర్తి చెప్పలేక ..తాతల తరాల ..వూరు వదిలి ..
వలస బ్రతుకు బ్రతకలేక ..బావురంటూ ఏడ్చినా ..
గద్దెలెక్కి .. గ్రద్దలైన ..నాయకులకు ..పట్టదు ..
నువ్వు పెంచిన గట్టు మీద …వేపచెట్టు..
నువ్వు పేనిన..జనప తాడు ..కడకు నీకు నేస్తాలై ..
ఋణం తీర్చుకుంటున్నాయి….