శీర్షిక-: ఉనికి కొరకు పోరు
రచన-:విజయ గోలి
జాలరిగా జీవనం ..
పొద్దు చుక్క పిలుపు తో
సద్దు నిదుర లేస్తుంది
సంద్రంలో సంబరం
తెరచాపై తేలుతుంది
అలల వలల సవ్వడిలో
తొలికిరణం మెరుస్తుంది…
సూరీడితో సూటీగా పోటీలో
కడలిపైన పరుగులెత్తు నావ
వినువీధిన విహంగాల చుక్కాని
మేఘాల గాలివాలు ..తెరచాపల జోరు
తెడ్డుపైన తెడ్డేస్తూ..హైలెస్సా ఓలెస్సా
సరంగుల పాటలతో సాగుతుంది వేట
బ్రతుకు బండి నడిపేందుకు
ఆశనింపి విసిరుతున్న వల..
చేపలతో బరువెక్కిన వల
కొండెక్కును కోరికల గలగల
ఒడ్డుపైన ఎదురు చూసు ఓరిమి
కదలాడు కన్నుల మిలమిల
గుండెనిండు గుసగుసల నవ్వుల
సూరీడు అలసిపోయి
పడమటింట తొంగున్నా..
ఆటుపోటు అలలున్నా
సుడిగుండాలెదురైనా
సుడిగాలులు తరుముతున్నా
దినదినము గండమున్నా.
గూడు చెదురు ఆలోచన
గుండెలోకి రానీయక
గంగమ్మను తలచుకుంటూ…
దిటవైన ధిలాసా. .మోముపైన నిలుపుకుంటు
అడుగడుగున ఆశలనే నింపుకుంటు
ఉదయాస్తమానాలు.ఉనికి కొరకే పోరు
సాగుతుంది ..జీవనం..సాగరాన హోరుగా..