అష్టవిధ నాయికలు

అష్టవిధ నాయికలు

(1)స్వాధీన పతిక. విజయ గోలి.

పుణ్యమెంత చేసినావొ పూలనింపు నన్నుచేరి
గోవిందుడె దాసుడాయె ప్రేమనింపు నన్ను చేరి

కస్తూరియే దిద్దబోవు కాటుకలే సరిజేయును
అధరముల దరహాసము మమతనింపు నన్నుచేరి

అరచేతుల గోరింటల తారలనే నిలుపకోరు
కొనగోటిన కొంగుసర్ది కోర్కెనింపు నన్ను చేరి

సొక్కినావు నీవనుచు గోముచేసి తినిపించును
అంటెనేదొ పెదవిననుచు మధువునింపు నన్ను చేరి

కురులుదువ్వి విరులుముడిచి కునుకులనే కాజేయును
పాదములా పారాణుల సొగసునింపు నన్ను చేరి

చెక్కిలిపై చందనాలు చిలుకుతానె చిలిపిగాను
పడకటింట పరిమళాల వలపునింపు నన్నుచేరి

కొంగువిడక  స్వాధీన పతిక కోరికోరి కొలిచేనులె
నిమిషమైన ఎడబాయక హాయినింపు నన్నుచేరి

 

 

(2)వాసక సజ్జిక       గజల్. విజయ గోలి

సందెవేళ కన్నయ్యకు సందేశమె పంపినదీ
కనుపాపలు దీపాలుగ వాకిటనే నిలిపినదీ

పచ్చనైన  తోరణాలు కట్టినదీ స్వాగతించ
ముంగిటనే ముగ్గులల్లి రంగులద్ది మురిసినదీ

జవ్వాదుల స్నానమాడి  జిలుగుచీర మేనిచుట్టి
సన్నజాజి సంపెంగలు సిగనుచుట్టి సర్దినదీ

చంద్రవంక నుదుటదిద్ది సోగకళ్ళ కాటుకద్దీ
వన్నెవన్నె నగలన్నియు వరుసలుగా పెట్టినదీ

అలరించే సాంబ్రాణీ  ధూపాలనె వెలిగించీ
పాలుపళ్ళు తాంబూలపు పళ్ళెరాలె పరిచినదీ

అద్దమందు సొగసుదిద్ది అలతినవ్వు అధరమద్ది
పాలవన్నె పానుపేసి విరులుజల్లి నిలిచినదీ

చిరుసిగ్గుల మొగ్గలతో “వాసకసజ్జిక తనివితీర
వలపుజల్లు కురిపించగ వనమాలికై వేచినదీ

 

అష్టవిధ నాయికలు

(3)విరహోత్కంఠిత విజయ గోలి గజల్

కలలేమో ఝాములలో కరిగాయిలె గోపాలా
కనులేమో చూపులలో తడిచాయిలె గోపాలా

పొగడపూలె జల్లులుగా పొదరిళ్ళను కురిసేనే
వెన్నెలలే వేసవులై మరిగాయిలె గోపాలా

గువ్వలాడు గుసగుసలే గుండెలలో గుబులాయిలే
లలితమైన లాలనలే కోరాయిలె గోపాలా

విరహములా ఎదసవ్వడి వినవేలా యదుపాలా
మదినిండుగ నీరూపమె కొలువాయిలె గోపాలా

మల్లెపూల మాలగాను ముద్దుగుమ్మ వేచినదీ
మధువులకై మధుపములే ముసిరాయిలె గోపాలా

మోహనమే ఆమురళీ మోహములే పెంచేనుగ
మరులేవో మదనదేవు శరములాయె గోపాలా

తనువంతా ధనువాయే తాపమార వేడినదే
తరుణినేల రాలేవా తరుణమాయె గోపాలా

(4 )విప్రలబ్ధ. విజయ గోలి. గజల్

తొలిఝాములు మలిఝాములు మలిగాయెలె మాధవా
తొలిచుక్కలు మలిచుక్కలు మరుగాయెలె మాధవా.

రెప్పాడని కనుపాపల తంగేడులు విరిసెనే
ఆకురాలు అలికిడికే ఉలుకాయెలె మాధవా

ప్రణయదేవి నీవనుచును పరువాలే సాక్షిగా
బాసలన్నీ ఊసులుగా వీగాయెలె మాధవా

పిలుపులుగా  సఖులనేగ అంపినాను  ఏమాయె
ఉలుకు పలుకు కబురు లేదు  కినుకాయెలె మాధవా

పలుమారులు నినువేడుచు పలుచనైతి పదుగురిలొ
పిల్లనగ్రోవి పిలుపులనే విననాయెలె మాధవా

కరుణ లేదో కానరావు ఎన్ని రేలు వేచేను
వలదనిన మనసదేమొ వినదాయెలె మాధవా

మాయగాడ  మరలిరాకు మోసపోతి నినుకోరి
రౌమ్మనుచూ పిలవనులే వెతలాయెలె మాధవా

(5)కలహాంతరిత. గజల్ విజయ గోలి

మౌనంలో మాటలనే పలకకుంది ఏమైనదొ
సఖులతోడ ఆటలనే ఆడకుంది ఏమైనదొ

వెంటతిరుగు విభునితోడ వాదమాడు వంకలతో
వెడలిపోవు గోపాలుని  పిలవకుంది ఏమైనదొ

కోయిలతో కుహుమంటూ పంతముతో పాడదుగా
చిలుకలతో పలుకులనే పంచకుంది ఏమైనదొ

తోటమలుపు తొంగిచూచు వీచుగాలి నదిలించును
పూలురాలు అలికిడికే విసుగుతుంది ఏమైనదొ

వెన్నెలలో వన్నెలలో చిన్నెలన్నీ మారిపోయె
జాలేదని జాబిలిపై అలుగుతుంది ఏమైనదొ

కన్నయ్యను తలచితలచి కసురుతుంది కరుణలేక
మేఘాలను దూతలుగా పంపుతుంది ఏమైనదొ

రమణిమనసు తెలియలేని రాలుగాయి కాదుకదా
రాడేలని రచ్చచేసి రగులుతుంది ఏమైనదొ

(6)ఖండిత. విజయ గోలి గజల్

సొగసుగాడ సాధించకు నటనలతో మురిపింపగ
మాయగాడ వేళాయెన మాటలతో మరిపింపగ

దారితప్పి దయజేసిరొ మతిమాలీ అడుగిడిరో
ఆగాగుము అతిశయాల ఆటలతో కవ్వింపగ

చెక్కిలిపై చందనాలు కర్పూరపు విందులేమొ
వలచివచ్చు చెలులుకదా వేడుకతో రంజింపగ

వేచిలేరు స్వాగతించ పడకటింట పానుపేసి
వెడలిరండు పిలిచేరట కౌగిళ్ళను బంధింపగ

ఓపలేక కసిరినాను మరలినాడె మా రాడక
నీరైనను ఇవ్వలేదు కోపాలతొ వేధింపగ

తెలియలేడొ నామనసును తెలవారగ రాడేమో
ఎడబాటుతొ మనలేనని ఎరుకలేదొ వారింపగ

కలహమాడి *ఖండిత నై తూలితినే మాటలలో
విరహముతో వేచితినే వేదనెంతొ వినిపింపగ

 

(7)ప్రోషిత భర్త్రుక * విజయ గోలి గజల్

ఎదురుచూపు ఎదలోపల దిగులాయెను రాడేలనొ
సందెకూడ సద్దుమణిగె. గుబులాయెను రాడేలనొ

జాణవులే  రామచిలుక  జోడుగాని జాడచెప్పు
జామితోట నిలిచెనేమొ  జాగాయెను రాడేలనొ

మరలివత్తు మారాడకు విరహాలకు విందుచేయ
బాసచేసి వెడలినాడు  మరుపాయెను రాడేలనొ

చుక్కలన్నీ చక్కనయ్య పక్కజేరె పరవశాన
ఎడబాటుల ఎదలోతుల వెతలాయెను రాడేలనొ

రాగములే రవళించగ మురళిజాడ అగుపించక
తాళలేని విరహబాధ తపమాయెను రాడేలనొ

మల్లెలతో మంతనాలు మధురమైన కధలేకద
గాలులతో కబురులేమొ కలలాయెను రాడేలనొ

రేయంతా చూసినాను రేరాజై కానరాడు
వేచివేచి కన్నులలో వెలుగారెను రాడేలనొ

 

(8)అభిసారిక. విజయ గోలి గజల్

నల్లనయ్య పిలుపులేవొ వినిపించెను మైమరపుల
మదినింపిన వలపులేవొ తలపించెను మైమరపుల

మేఘమంటి తెలిచీరలొ మేనిమెరుపు విరుపులుగ
మరుమల్లియ మాలలెన్నో మురిపించెను మైమరపుల

తలుపుమూసి మేలిముసుగు మోముదాచి రాధమ్మా
అదురుబెదురు చూపులతో అరుదెంచెను మైమరపుల

అడుగులోన అడుగుదాచి అందియలను మ్రోగనీక
కంకణాల కలవరమే అలరించెను మైమరపుల

ముసురుతున్న మబ్బులలో మెరుపుతీగ దారిచూప
చిరుచినుకుల చిటపటలో తడబడేను మైమరపుల

చీరతడిచి సిగ్గులలో సొగసులన్ని సొంపులొలక
విరిశరములె గురిచూడగ తపియించెను మైమరపుల

పొన్ననీడ పొదరిళ్ళన  వేచినదే  *అభిసారిక
పరువాలే హరివిల్లుగ విరపూసెను మైమరపుల

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language