అమ్మవడిన ఆడుకున్న గురుతు

శుభోదయం🌹🌹🌹🌹🌹
గజల్ విజయ గోలి
అమ్మవడిన ఆడుకున్న తలపొక్కటి నవ్వింది
కాగితాల పడవలతో కాలమొకటి  నవ్వింది
వనమంతా విరపూసిన పరిమళాల  చిరుజల్లు
ఆటాడిన  ఆదమరుపు అందమొకటి నవ్వింది
తొలిప్రేమల విరహాలతొ తులతూగిన మబ్బులలొ
దాగివున్న  చుక్కపూల మెరుపొక్కటి   నవ్వింది
ఒడిదుడుకుల నడకలలో ఒదగలేని దారులలొ
తడబడిన అడుగులలొ మరుపొక్కటి నవ్వింది
గుండెలలో  నిండివున్న  వెలుగునీడ  చిన్నెలుగ
మలిసంధ్యన  మలిగిపోని గురుతొక్కటి  నవ్వింది

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language