*అమ్మపిట్ట విజయ గోలి
నడిరాతిరి జడివానకు
భయపడి అమ్మరెక్కల
క్రిందకు దూరుతున్న
బుజ్జి పిట్టలను ఇంకా ఇంకా
దగ్గరకి పొదుపు కుంటూ
గుండె అలజడి గువ్వలకు
తెలియనీక ఉరుముల సడికి
ఉలికి పడుతున్న బిడ్డలను
రెప్పమూయక రెక్క కదపక
రేయంతా ..వెలుగురేఖలకై
ఎదురు చూస్తూ ….అమ్మపిట్ట
చిరుగాలితొ తడిఆకుల
కుశలమడుగుతూ..తొలికిరణపు
వెచ్చదనం నులివెచ్చగ తాకింది
కూనల కునుకు చెదరనీక
గూటినుండి బయటకువచ్చింది
పరిసరాలు పరికించి చూసింది
ఉషోదయపు తొలి వెలుగులో
చిగురులపై చిరుచినుకుల
దరహాసం మెరిసింది
కడరాతిరి కలవరం కలలాగే ముగిసింది
కన్నులలో కొత్తఆశల
ఇంద్ర ధనుస్సు విరిసింది
రెక్కల రెపరెపలతో నింగి వంక చూసింది..
గూటిలోని గువ్వలు లేచే లోగా
చిత్తడి నేలలో చిరుపురుగులు వెతుకాలంటూ..
అలుపు లేని రెక్కలను విప్పార్చుకు ఎగిరింది
రెక్కల కష్టపు ఆనందం..రెట్టింపు చేస్తూ
మరో కొత్తరోజుకు స్వాగతం పలుకుతూ ….అమ్మ పిట్ట