గజల్. విజయ గోలి
కోడికూత పిలుపులలో పలుకేకద అమ్మంటే
పొద్దుపొడుపు సింధూరపు మెరుపేకద అమ్మంటే
ముంగిటిలో రంగవల్లి మురిపాల నవ్వులలో
తూరుపునా తులసిముందు వెలుగేకద అమ్మంటే
నట్టింటిలో మట్టెలతో పసుపంటిన పాదాలే
చేతలలో చిరుగాజుల సడియేకద అమ్మంటే
నడిమింటన ఉయ్యాలకు నడిరేయిన లాలిపాట
అలుపులేని అలరింపుల హాయేకద అమ్మంటే
చద్దిలోన చల్లకలిపి ముద్దలుగా ముద్దారగా
ముచ్చటలో బొజ్జనింపు మమతేకద అమ్మంటే
తల్లివున్న ప్రతిఇల్లు ఆనందపు హరివిల్లులె
ఇంటింటా వేలుపైన బ్రహ్మేకద అమ్మంటే
ఆమెవుంటె అదృష్టము ఆమాటే *విజయ ముగా
కల్పతరువు మించినట్టి కలిమేకద అమ్మంటే