అద్దమంటి మనసు

శుభోదయం 🌹🌹🌹🌹🌹

గజల్. విజయ గోలి

అద్దమంటి మనసులోన కలవరాలు ఎందుకనీ
మానలేని గాయాలకు లేపనాలు ఎందుకనీ

గుండెచీరి గునపాలతొ గుచ్చివేయ బ్రతుకేమిటి
వెలుగుదారి చూపలేని ఆలయాలు ఎందుకనీ

మౌనాలలో మాటలనే దాచుకుంటె వివరమెలా
వేడుతున్నా ఆడుకునే వినోదాలు ఎందుకనీ

మనసులేని బండరాయి మనసిచ్చి మోసపోతి
అడగలేను దేవుళ్ళను అందలాలు ఎందుకనీ

పిచ్చివాడు బిచ్చగాడు ఒంటరినై నీవాకిట
రేయంతా రెప్పలార్పక రోదనాలు ఎందుకనీ

చిరుమువ్వల పాదాలను కన్నీటితొ కడుగుతున్న
కలలనన్ని కాలదన్ని వివాదాలు ఎందుకనీ

గుండెనిండు ప్రేమలతో “విజయ”మగును ప్రియతమా
నిరుపేదను నేనంటూ అంతరాలు ఎందుకనీ

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language