అద్దమంటి మనసు

విజయ గోలి. గజల్

అద్దమంటి మనసులోన కలవరాలు ఎందుకనీ
మానలేని గాయాలకు లేపనాలు ఎందుకనీ

గుండెచీరి గునపాలతొ గుచ్చివేయ బ్రతుకేమిటి
వెలుగుదారి చూపలేని ఆలయాలు ఎందుకనీ

మనసులేని బండరాయి మనసిచ్చి మోసపోతి
అడగలేను దేవుళ్ళను అందలాలు ఎందుకని

మౌనాలలో మాటలనే దాచుకుంటె వివరమెలా
వేడుతున్నా ఆడుకునే వినోదాలు ఎందుకనీ

పిచ్చివాడు బిచ్చగాడు ఒంటరినై నీవాకిట
రేయంతా రెప్పార్పక రోదనాలు ఎందుకనీ

చిరుమువ్వల పాదాలను కన్నీటితో కడుగుతున్న
కన్నకలలు  కాలదన్ని వివాదాలు ఎందుకనీ

గుండెనిండు ప్రేమలతో “విజయ”మగును ప్రియతమా
నిరుపేదను నేనంటూ అంతరాలు ఎందుకనీ

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language