########అదేమిటో….విజయ గోలి
భారతం లో పుట్టిన ప్రతి అతివ ..
బంధంతో ..బలహీనత పెంచుకుంది..
ఉరుము చప్పుడుకే .. ఉలిక్కిపడుతుంది ..
పిడికిలి బిగిస్తే ..తానొక పిడుగునని మరిచిపోతుంది …
అదేమిటో ….
మంచితనాన్ని చేతగాని తనమంటూ …
ఒప్పుకుంటూ …తప్పించుకుంటుంది
తెలియక కాదు ..బంధాలే బహుమతులై
అల్లుకున్న తీగలన్నీ అల్లాడి పోతాయని….
అదేమిటో …
ఉద్రేకం ఉప్పెనలా పొంగుతుంటే …
మమతల మంచు దుప్పటి కప్పేస్తుంది ..
కరుగుతున్న కొవ్వొత్తికి ..కాలమెంతని లెక్కెట్టదు..
వెలుగుకు వెల కడుతున్నా ..నోరెత్తదు…
అదేమిటో ..
అందలాలు ఎక్కినా …ఆకాశం హద్దులు దాటినా ..
సరిహద్దులు కాసినా..సమరంలో గెలిచినా ..
అనాదిగా ..అరుంధతి …నాటినుండి ..
సంసారపు వలయంలో … సాలెపురుగు తానే..
సడలిస్తే..
ఎన్నాళ్ళీ ఎలనాగుల …తోటల కాపలాలు..
చీకటి తెరలను చింపేస్తూ …ఒక్కసారి రెక్కవిప్పితే
అరుణారుణ కిరణాల …అర్ధం మారుతుంది
మరుగైన మాతృస్వామ్యం …మళ్ళీ మెరుస్తుంది..