రచన-:విజయ గోలి
*అక్షరాయుధం
అక్షరాలే ఆయుధం
అజ్ఞానపు అగాధాలు
అధిగమించు సాధనం
ఉద్యమాల శకటానికి
ఉత్తేజిత ఇంధనం
అక్షరాల సంపదలే
న క్షరమౌ పెన్నిధులు
వరమే కద జీవితాన
వాగ్దేవి కరములు
శమంతకమణియై
వృద్ధినొందు దినదినము
దాచినను దోచలేని
ధనమే కద అక్షరం
అక్షరాల విలువ తెలిసి
అడుగు ముందుకేసావా
అణుబాంబుల విస్ఫోటనమే
అదిరిపోవు అణువణువు
అక్షరాలే అడుగు అక్షరాలే గొడుగు
అక్షరాల వర్ణించ అక్షరాలే చాలవు..