శ్రీనివాస్ రావు P
🌹🌹 విజయ గోలి గారు🌹🌹
నాకు fb లో పరిచయం అయిన కవయత్రిలలో ఒక ప్రత్యేకత వున్న గొప్ప వ్యక్తి, సాహిత్య ప్రక్రియలలో వీరు వ్రాసే కవితలు వాటిలోని అక్షర అలంకరణ చాలా ఖచ్చితంగా వుంటుంది. ఇక వీరు వ్రాసే ఘజల్స్ గురించి చెప్పాలి అంటే, అందంగ సరళంగా ఉంటాయి. నాలాంటి సాధారణ వ్యక్తులు కూడా ఘజల్ చదువుతుంటే అసంకల్పితంగా అది రాగ యుక్తం గా వుంటుంది. ఇక వీరు వ్రాసే అనువాద ఘజల్స్ కూడా వాటి మూల భావంపోకుండా చక్కగా
తెలుగుకిరంచడం చాలా గొప్ప విషయం. అమ్మ మీద ఈ గజల్ నభూతో నభవిష్యతి. అభినందనలుతో
🖋️Sree🖋️
ఈరోజు ఎందుకో అమ్మ మీద గజల్ వ్రాయలని అనిపంచింది…అమ్మంటే …అందరికీ ప్రాణమే…నాకు 13 సంవత్సరాల వయసపుడు మాఅమ్మ బ్లడ్ క్యాన్సర్ తో కాలంచేసింది…అప్పట్లో ఆమె 8th standred చదువుకున్నది…పురాణ కధలు .దేశభక్తిగీతాలు ..ఇలా చాలా నేర్పించేది..పుస్తకాలకి ముఖ్యంగ చదువు గురించి ప్రత్యేక శ్రద్ద తీసుకునేది .పుస్తకాలు..అట్టలు వేయటం ..హోమ్ వర్క్ .. చేయించటం…చరిత్ర పుస్తకాలు చదివి కధలు గా చెప్పేది.. …చదివించటం…కుట్లు అల్లికలు వంటలు…అన్నిటిలో ప్రావీణ్యత …9మంది సంతానాన్ని…ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా…చూసేది…ఎవ్వరికీ ఏలోటు రానీకుండ …నాన్నకి ఎంతో చేదోడుగావుండేది ..ఎపుడూ చిరునవ్వు చెరగకుండా…ఎపుడు నిద్ర లేచేదో ఎపుడు తినేదో కూడా తెలిసేదికాదు. ముగ్గురు అన్నదమ్ముల ఉమ్మడి కుటుంబములో పెద్దకోడలు…ఇంట్లోవాళ్ళకి …ఇరుగు పొరుగు వాళ్ళకి స్నేహశీలి .ఆమెకు వున్న ఏకైక అలవాటు బుక్స్ చదవటం…..అంత తీరికలేని సమయంలో కూడా తీరికచేసుకుని. వారపత్రికలు చదివేది…చదువు మీద ఆవిడకున్న శ్రద్ధే మమ్మల్ని అందరిని విద్యావంతుల్ని చేసింది….మా అందరికి మాఅమ్మే ఆదర్శం….ఏలోటు లేకుండా పెరిగినా…అమ్మ లేని లోటు …లోటే…అది ఎవరు పూడ్చలేనిది….నాకు తెలిసిన మా అమ్మ….నా గజల్ లో లా వుండేది….అమ్మ కోసం….ఈ గజల్..
గజల్. విజయ గోలి
కోడికూత పిలుపులలో పలుకేకద అమ్మంటే
పొద్దుపొడుపు సింధూరపు మెరుపేకద అమ్మంటే
ముంగిటిలో రంగవల్లి మురిపాల నవ్వులో
తూరుపునా తులసిముందు వెలుగేకద అమ్మంటే
నట్టింటిలో మట్టెలతో పసుపంటిన పాదాలు
చేతలలో చిరుగాజుల సడియేకద అమ్మంటే
నడిమింటన ఉయ్యాలకు నడిరేయిన లాలిగా
అలుపులేని అలరింపుల హాయేకద అమ్మంటే
చద్దిలోన చల్లకలిపి ముద్దలుగా ముద్దారా
ముచ్చటలో బొజ్జనింపు మమతేకద అమ్మంటే
అమ్మవున్న ప్రతిఇల్లు ఆనందపు హరివిల్లు
ఇంటింటా వేలుపైన బ్రహ్మేకద అమ్మంటే
అమ్మవుంటె అదృష్టము అమ్మఅంటె *విజయ మే
కల్పతరువు మించినట్టి కలిమేకద అమ్మంటే