అమ్మ మాట
శ్రావణ మాసపు మబ్బుల మాటున
మెరిసిన జాబిలి తునక
సిరిగంధపు చిరు మొలక
“భార్గవి “పేరున బంగరు పాపాయి !
నాన్న వేలు గుప్పిట బట్టి
నడతలు నేర్చిన ముద్దుల పట్టి
అమ్మ మాటలను చిలుక లా
చిట్టిగ పలికిన మాటల పుట్ట!
ఆటల పాటల అల్లరి చెల్లి
చేయి వీడదు నేటికి కూడా
స్నేహాలకు అనుబంధాలకు
తనకు తానే బందీ ఎపుడూ ..!
విద్యల్లో మెరిసిన రవ్వ తాను …
నాట్యంలో రవళించే మువ్వ తాను
దైవమంటె నమ్మకం .. పెద్దలంటే గౌరవం
సంస్కారపు ప్రతి రూపమె తాను !
మనసిచ్చిన రాజా*తో *మారాణి గ
నడిచింది పగడాల గడపలోకి పాలవెల్లి ..
వరమిచ్చెను వారసులను కానుకగా ..
.”సింధుపాణి ,”సారంగ ..తన కంటి వెలుగులుగా!
కలత చూసి కరుణ పొంగు మనసంటే
కదిలి పోవు గంగమ్మే …ఈ భార్గవి
బాధ్యతలకు భయపడక ..భారమనక
మెట్టు మెట్టు పైకెక్కిన మేరు నగ ధీర !
ఎదిగినాక ఒదిగినదే జీవితం…
ఎర్ర తివాచీ పై ఎల్లపుడు సాగాలి
మనసు పెంచి పంచినదే ఆరోగ్యం ..
ఐశ్వర్యం నీ ముంగిట రంగవల్లి కావాలి !
ఐదుపదుల వసంతాల అడుగైనా
అమ్మ వడిన ఐదు నెలల పాపాయే
అమ్మ నోటి మాటెపుడూ ఆశీస్సే …
ఆనందం హర్షాలతో వర్షంగా కురవాలి!
అంబరమే సంబరాల అమృతాన్ని వొంపాలి !
బ్రతుకంతా ప్రతిరోజూ …పుట్టిన రోజు పండుగై వెలగాలి !