శుభోదయం🌹🌹🌹🌹🌹
గజల్ విజయ గోలి
తొలి చినుకుల తోరణాల అడుగేసే ఆషాఢం
వాడివున్న తరువులలో వన్నె తెచ్చె ఆషాఢం
మేఘాలతొ సందేశం మెరుపుతీగ పద లాస్యం
నవ జంటల వియోగాల గుబులు పెంచె ఆషాఢం
అరచేతిన గోరింటల అరుణవర్ణ రాగంగా
అతివలకే సౌభాగ్యపు శోభ నింపె ఆషాఢం
జగమేలే జగన్నాధు శేష పాన్పు శయనుడాయె
సేదతీర యోగనిద్రై అలల తేల్చె ఆషాఢం
త్రిమూర్తుల ప్రతిరూపం విజయానికి దిశ చూపిన
పరంపరగ గురుపౌర్ణమి ఘనతచెప్పె ఆషాఢం