శుభోదయం 🌹🌹🌹🌹🌹
ఇది ఒక హిందీ కవితకు అనుసృజన
అభిలాష విజయ గోలి
వనమాలీ తుంచకోయి నన్ను
పువ్వును నేనై పుడమిన పుట్టి
వడిలి పోదును ఒక్క ఘడియలో
ఆదరాన ఆలకించు నా అభిలాష
కోవెల వెలసిన దైవాలకు
అలంకారమై అలరారి
పరమ పదాలు పొందాలని లేదు
కొండంత ఆశలేని గోరంత పూవు నేను
కోరిక లేదు కోమలాంగుల
శిగ పాయలలో మురవాలని
మధుపాలకు మధుపాత్రగ
మారాలని లేనే లేదు
కలిమి దొరల కంఠానికి
కానుక నేను కావాలని లేదు
రాజకీయ శవ పేటికపై
తుళ్ళి పడే జల్లును కాలేను
కోరేను ఒక కోరిక ..తీర్చవోయి వనమాలీ
దేశమాత రక్షణలో
సరిహద్దుల సమరంలో
ఎదురు నిలిచి పుడమి ఒరిగిన
పుణ్యమూర్తుల సమాధిపై
విసిరి వేయి నన్ను …విసుగు కొనక
ధన్యత పొందుదు ఈ ధరణిన పుట్టినందుకు…