గజల్ విజయ గోలి
అర్ధరాత్రి నా స్వప్నం అందంగా నవ్వింది
అంతలోనే అలిగిపోయి గుమ్మంలో నిలిచింది
వెనుతిరిగి చూడబోగ మది తలుపులు మూసింది
పగటి కలగ కనుపాపల కదలికలో కరిగింది
మల్లెపూలు మంత్రంగా వసంతాలు చవిచూపి
గ్రీష్మంగా బతుకంతా వడగాల్పులు నింపింది
తిమిరాలను తడుముకుంటు వేచినాను తలపులో
రెప్ప మాటు ముత్యంగా రేయి పగలు తడిచింది
కల వరముగ ఇవ్వమనీ దైవాలను కోరేను
నిదుర లేని నిశీధినే విజయంగా నిలిపింది