కైంకర్యం – వారసత్వం

శుభోదయం 🌹🌹🌹🌹🌹

పొన్నాడ వారి పున్నాగ వనం నిత్యమల్లి కధా స్రవంతి కొరకు నేను వ్రాసిన. కధ

*కైంకర్యం -వారసత్వం విజయ గోలి

అదొక అందమైన పల్లెటూరు . పచ్చని పంట పొలాలు , చుట్టూ చిన్న చిన్న పంట కాలువల మధ్య పురాతన మైన పాత వేణుగోపాల స్వామి గుడి ఊరిలో అందరూ కృష్ణుడి గుడి , గోపాల స్వామి గుడి అంటారు . పేరుకు పల్లెటూరులో
వున్నదన్న మాటే కాని వచ్చే పోయే జనంతో ఎపుడూ కళ కళ లాడుతూవుంటుంది .మహిమ గల దేవుడని చెప్పుకుంటారు . నల్ల రాతి మూల విరాట్‌ విగ్రహం జీవ కళ తో …ఎటు చూసినా మన వంకే చూస్తున్నట్లుగా చాలా అందంగా వుంటుంది .అలాగే మరో పక్కన పారాడే “చిన్ని కృష్ణుడు చేతిలో వెన్న ముద్దతో
చేత వెన్నముద్ద;
చెంగల్వ పూదండ;బంగారు మొలతాడు; పట్టు దట్టి; సందె తాయత్తు; సరిమువ్వ గజ్జెలు; చిన్నికృష్ణ! నిన్ను నే చేరికొలుతు”
పాటను గుర్తు చేస్తూ కను విందు చేస్తుంది .
పిల్లలు లేని వారు ఈ బాల కృష్ణుడిని మొక్కుకుంటే పిల్లలు పుడతారని ప్రతీతి
అలా అసలు కృష్ణుడి కంటే ఈ చిన్ని కృష్ణుడికే పూజలెక్కువ .
అందులో పూజారి రామకృష్ణాచారి గారు చేసే అలంకారం ఎవరినీ కను తిప్పుకోనీయదు .ఇద్దరు కృష్ణులు కూడా అంత అందంగా వుంటారు .
విశాలమైన ఆలయ ప్రాంగణమంతా బృందావనాన్ని మరిపించేలా
ఒకవైపు తులసి వనం ,మరో వైపు పొన్న ,పొగడ ,పారిజాతాలు , మందార ,మల్లె ,జాజి ,విరజాజి , గులాబీలు ,బంతులు , చేమంతులు, మాలతీ లత,మనోహరాలు ,జూకా మల్లెలు మన్మధ బాణాలు ,కనకాంబరాలు,నీలాంబరాలు చెంగలువ పూల చెట్లే కాక ఇంకా పనస ,నారింజ ,జామ,నేరేడు ,దానిమ్మ , మామిడి రక రకాల పండ్ల చెట్లు ,చెట్ల పై గూళ్ళు కట్టుకున్న రక రకాల పిట్టలు , పావురాళ్ళు , చెంగు చెంగున ఎగురుతూ కాళ్ళకు అడ్డం పడే కుందేళ్లు పూలపై వాలుతున్న సీతాకోకచిలుకలు , ఆవరణలోనే దూరంగా గోశాల …అందులో చిందులేసే బుజ్జి దూడల గంటల సవ్వడి .
ఒక ప్రక్కన నాలుగు వైపుల రాతి మెట్లతో కట్టిన కోనేరు …కోనేటిలో తెల్ల కలువలు ..గుడి ముందు నిలువెత్తున నిలబడిన ధ్వజస్తంభం చిరుగంటల సవ్వడి వూరంతా సన్నని వేణు గానం లా వీనుల విందు చేస్తూ వుంటాయి .
“ఏసమయం లో నైనా గుడిలో అడుగు పెట్టిన వారికి ఆ పరిసరాలు అలౌకిక మైన ఆహ్లాదాన్ని ఆనందాన్ని ప్రశాంతతను కలిగిస్తాయి. ఈ ఆనందాన్ని అనుభవించిన ప్రతి ఒక్కరికి బృందావనాన్ని ఇంత అందంగా తీర్చి దిద్దిన తోట మాలి ఎవరా …అని కలయ చూస్తారు .”
అలా చూసినప్పుడు “ఏ చెట్టు దగ్గరో పాదులు తీస్తూనో , నీళ్ళు పోస్తూనో ,పూలు కోస్తూనో పసిడి రంగులో మెరిసి పోతూ ,నల్లని పెద్ద జడతో చక్కటి కను ముక్కు తీరుతో ఇరవై సంవత్సరాల అందమైన యువతి వనకన్య లా కనిపిస్తుంది …
ఆ యువతి వెన కాలే వీపు పై ఉయ్యాల ఊగుతూ తెల్లని బాలకృష్ణుడిలా చక్కని ఉంగరాల జుట్టు ముఖం మీద పడుతూ ..పెద్ద పెద్ద కళ్ళ తో ,కాళ్ళకి మువ్వల కడియాలతో మూడు సంవత్సరాల బాలుడు ఆమెను అనుసరిస్తూ కనుపిస్తాడు .
ఆయువతి పేరు కృష్ణ వేణి .ఆబాలుడి పేరు కృష్ణమాచార్యులు .ఆ బాలుడు కృష్ణ వేణి కొడుకు . ఆ అమ్మాయి పూజారి రామకృష్ణాచారి గారి కూతురు .. వంశ పారంపర్యంగా తరతరాలుగా గుడి కైంకర్యం నిర్వహిస్తున్న కుటుంబం వారిది .
రామకృష్ణాచారి గారి తాత గారు రామాచార్యులు గారికి ఇద్దరు మగ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు .
పెద్ద కుమారుడు కృష్ణమాచార్యులు వేదం చదువుకుని వంశ కైంకర్యాన్ని అంది పుచ్చుకున్నారు .
చిన్న కొడుకు తిరుమలాచార్యులు చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ పట్నం లో స్థిర పడ్డారు
ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసి అత్త వారింటికి పంపారు .
ఆ గుళ్ళోనే పక్కనే వున్న మూడు గదుల ఇంట్లో వుండేవారు .
రామాచార్యులు గారి భార్య అచ్యుతవల్లి
చక్కగా నుదుటున రూపాయి కాసంత కుంకుమ బొట్టు తో మెడకు ఆనుకుని నల్లపూసలు .పసుపు పూసిన పాదాలకు మెట్టెలు, పట్టీలు .నవ్వు ముఖం
నిండు ముత్తైదుతనంతో మహాలక్ష్మి లా వుండేది .
రామాచార్యులు గారు కూడా మంచి స్ఫురద్రూపి
పచ్చటి ఛాయలో చాలా అందంగా వుండే వారు .
ఇద్దరు లక్ష్మీ నారాయుణులు లాగా వుండే వారు . ఆయన గొంతు కూడా చాలా శ్రావ్యంగా వుండేది .
ఆయన అర్చన చేసేటపుడు చదివే మంత్రాలు వింటుంటే మంత్ర ముగ్ధులై నిలిచి పోతారు .ఊరి పెద్దలు ఊరు ఊరంతా ఆయనకు ఎంతో గౌరవించే వారు .ధనుర్మాసంలో ఆయన చదివే తిరుప్పావై , భాగవతం లాంటి పురాణ కాలక్షేపం వినటానికి పక్క ఊళ్ళ నుండి కూడా జనం వచ్చేవారు .
ఆలయానికి స్వామి నైవేద్యాలన్నీ అచ్యుతవల్లి తన చేతుల మీదుగానే చేసేది
స్వచ్ఛమైన నెయ్యి తో ఆవిడ చేసే చక్కెర పొంగలి , పులిహోర కోసం జనం ఎగబడే వాళ్ళు .
ఏ సమయం లో ఎవరొచ్చినా రోజంతా ప్రసాదం పంచుతూనేవుండేవాళ్ళు .
వారి హయాంలొ వారిల్లు పండుగలకి పబ్బాలకి వచ్చే కూతుళ్ళు అల్లుళ్లు మనవలు మనవరాళ్ళ తో కళ కళ లాడుతూ నిత్య కళ్యాణం పచ్చ తోరణం లావుండేది .
కైంకర్యం అందుకున్న పెద్ద కొడుకు కృష్ణ మాచారి భార్య మంగ తాయారు .
అత్త గారిని అనుసరిస్తూ అన్ని పనుల్లో ఆమెకు చేదోడు గా వుంటూ అన్ని బాధ్యతలు చక్కగా నిర్వర్తించి అందరిలో మంచి పేరు తెచ్చుకుంది .పెళ్ళైన మూడు సంవత్సరాల వరకు పిల్లలు లేక పోతే
రామాచారిగారు కోడలు చేత ఆరునెలలు బాలకృష్ణుడి పూజలు చేయించారు
అప్పుడు పుట్టాడు రామకృష్ణాచారి .
బాలకృష్ణుడి వరంతో పుట్టాడని ఇంటిల్లి పాదీ చాలా అపురూపంగా చూసేవారు .
ముద్దుగా వుండే రామకృష్ణాచారి తండ్రి వెనుకే ముద్దుగా మంత్రాలు చదువుతుంటే ఊరంతా ముచ్చట పడే వారు . చిన్న పంతులు అంటూ ముద్దుగా పిలిచే వారు.
రామకృష్ణమాచారి తర్వాత మూడు సంవత్సరాలకి అమృతవల్లి పుట్టింది . పదిహేనేళ్ళ వయసు రాగానే .. రామాచార్యుల గారి ఆధ్వర్యంలో కృష్ణమాచార్యులు తన పెద్దచెల్లెలు మహాలక్ష్మి కొడుకుకిచ్చి అమృత వల్లి పెళ్ళి చేసి పంపారు .
అలాగే చిన్నచెల్లి కూతురు సరస్వతిని రామకృష్ణాచారి కిచ్చి చేసుకున్నారు . అందరూ కలిసి మెలిసి వుండేవాళ్ళు .
రామాచార్యుల గారు , అచ్యుత వల్లి కాలం చేసారు .
ఆలయం కైంకర్య వ్వహారాలన్ని తండ్రీ కొడుకులుచూసుకునేవాళ్ళు .
పెద్దాయన పోయాక రాక పోకలు కొద్దిగా తగ్గినాయి . అది సమయం కుదరక మాత్రమే కానీ వేరే కారణం లేదు .ఏడాది కొక సారి జరిగే స్వామి తిరునాళ్ళకు మాత్రం అందరూ కలిసేవారు .
కృష్ణమాచారి గారు కూడా కాలం చేసారు ఆలయ బాధ్యత మొత్తం రామకృష్ణాచారి మీద పడింది .సరస్వతి కూడా అత్త గారి సూచనలనుసరించి నడుచు కొనేది ..
రామకృష్ణాచారి దంపతులకు కృష్ణ వేణి పుట్టింది .
కైంకర్య పారంపర్యానికి వారసుడు పుట్ట లేదని కొంత బాధ పడినా …కృష్ణ వేణి ని అల్లారు ముద్దుగా పెంచారు .
కృష్ణ వేణి పుట్టిన మూడేళ్ళకి మంగ తాయారు గారు కూడా కాలంచేసారు .
బాలకృష్ణుడి నోములు నోచినా సరస్వతికి మళ్ళీ నెల తప్ప లేదు . వారసుడు లేకుండా పోయాడనే చింత ఎక్కువైంది రామకృష్ణాచారికి .
కుటుంబంలోని వారెవరూ పౌరోహిత్యం తీసుకుని ఇక్కడికి వచ్చి వుండటానికి ఎవరూ ఇష్ట పడలేదు .
ఊరి పెద్దలకు కూడా ఎన్నో తరాలుగా వస్తున్న వారసత్వం పేరుతో రామకృష్ణాచారిని వదులుకోవటం ఇష్టం లేదు .అందరూ ఆ వేణు గోపాలుడి పై నే భారం పెట్టారు .ఆ దంపతులు కూడా భగవంతుడే దారి చూపిస్తాడని ధైర్యంగా స్వామి సేవలు చేస్తుండేవారు .
ప్రతి రోజు సరస్వతి తో పాటుగా కృష్ణ వేణి పూలుకోయటం
మాలలుకట్టటం . తండ్రి తో పాటుగా కృష్ణయ్య అలంకారం చేయటం ..
తండ్రితో కలసి అర్చనలు చాలా ఇష్టంగా చేసేది .
“సరస్వతి చిన్నపుడు సంగీతం నేర్చుకున్నది .ప్రతి రోజూ చక్కటి కీర్తనలు ,మంగళ హారతులు ,పవళింపు సేవ పాటలు ఎంతో మధురంగా పాడుతుండేది .
తల్లి తో పాటు కృష్ణ వేణి ఐదు ఆరు సంవత్సరాల వయసులోనె తల్లి పాడే ప్రతి పాట పాడేది.చిన్న తనంలో పట్టు లంగా కట్టుకుని ధనుర్మాసంలో తులసి వనంలో తిరుగుతూ
పూలు కోస్తూ ఆలయంలో తిరుగుతుంటే ఊరి వారందరు చిన్ని గోదమ్మా …అని పిలిచే వారు .నాలుగు సంవత్సరాల వయసునుంచే తల్లి తండ్రులతో కలసి తిరుప్పావై చదివేది .
కృష్ణవేణికి వేణుగోపాలస్వామి అన్నా చిన్ని కృష్ణుడన్నా ..అమితమైన ప్రేమ . చిన్ని కృష్ణుడంటే ఒక స్నేహితుడు , తమ్ముడు .తనకంటే చిన్నవాడనే అభిప్రాయం.
పెద్ద కృష్ణుడంటే దేవుడు ,అమ్మా నాన్న లా పెద్ద వాడు భక్తి గౌరవం .
తమ్ముడిని ఇవ్వలేదని కొద్ది రోజులు చిన్నికృష్ణుడి పై అలిగేది ..కాని వెంటనే తనే పెద్ద దానిలా క్షమించేది .
చిన్నికృష్ణుడికి పెట్టే నైవేద్యం వెన్న తనకు ఊహ తెలిసినప్పటినుండి తనే చిలికి చిన్న వెండి గిన్నె నిండా పట్టు కెళ్లి పెట్టేది .
అమ్మ ఎపుడైనా గద్దించినా , నాన్న అదిలించినా ..ఎవరేమన్నా పెద్ద కృష్ణుడి ముందు నిలబడి వాళ్ల మీద ఫిర్యాదు చేసేది .
పూల దండలు అలంకరించిన తర్వాత ఆ నల్లనయ్యను అదేపనిగా చూస్తూ
నిలబడి పోయేది .రోజూ తండ్రి చదివే భాగవతం లోని కృష్ణ లీలలు
విని చిన్ని కృష్ణున్ని కోప్పడేది . అలా అల్లరి చేయకూడదని సుద్దులు చెప్పేది
అమాయకమైన కృష్ణవేణి చేతలు చూసి అందరూ ముచ్చట పడే వాళ్ళు .
కృష్ణాష్టమి అంటే కృష్ణ వేణి హడావిడి అంతా ఇంతా కాదు ..అన్నీ తానై తిరిగేది .బుల్లి రాధమ్మ లా తయారయ్యేది .రక్షాబంధన్ వస్తే చిన్ని కృష్ణుడికి
రక్ష కట్టేది .ఆమె లోకం కృష్ణ మందిరమే .
బడి లో చేర్చారు. బడి లో చాలా శ్రధ్ధగా అన్నీ నేర్చుకునేది .ఇంటికి వస్తూనే
ఆ రోజు బడిలో జరిగిన విషయాలన్ని చిన్ని కృష్ణుడి ఎదురుగా కూర్చొని చెప్పేది .
ప్రతి చెట్టును ,పువ్వును , పిట్టను పలుకరించేది ..అలా అందరికీ ప్రియంగా పెరుగుతూ ఇంటర్ లో మంచి మార్కులతో ఉత్తీర్ణురాలైంది ..ఇంక చదువు చాలు పెళ్ళి చేద్దామని ఆలోచన వచ్చినపుడు …సరస్వతి రామకృష్ణాచారి గుండెల్లో గుబులు మొదలైంది.కృష్ణ వేణిని వదిలి ఎలా వుండాలని .ఇల్లరికం తెచ్చు కోవాలను కొన్నారు దానికి ముందుకు ఎవరూ రాలేదు .
“కుటుంబ సభ్యులందరూ
ప్రపంచం తెలియకుండా పెంచుతున్నావు .ఉద్యోగస్తుడి సంబంధం చూసి
చేద్దాం అని బలవంతం చేసారు .ఒప్పుకోక తప్ప లేదు ఆ దంపతులకు .
“కృష్ణ వేణి కూడా ఈ ఊరు ఈ గుడి వదిలి వెళ్లను అని మొండి కేసింది
ఇద్దరి కృష్ణుల ముందు నిలబడి పోట్లాడింది .చిన్నప్పటి నుండి నువ్వే లోకంగా బ్రతికాను .నన్నెందుకు దూరంగా పంపాలని చూస్తున్నావు అని ఏడ్చింది.నేను లేక పోతే నీకు వెన్న ఎవరు పెడతారని అలిగి చిన్ని కృష్ణుడికి
వెన్న పెట్టటం మానేసింది . కృష్ణవేణిని చూస్తే అందరికీ బాధగావున్నా…
అందరూ కలిసి పెళ్ళికి ఒప్పించారు .
వేణు గోపాల స్వామి గుళ్ళోనే పెళ్ళి జరిపించారు .
కృష్ణ వేణి భర్త నారాయణ పట్నంలో ప్రభుత్వ ఉద్యోగి .
భర్త తో అత్త గారింటికి వెళ్ళే రోజు ఇటు సరస్వతీ , రామకృష్ణుల బాధ వర్ణనాతీతం .అలాగే కృష్ణ వేణి కూడా గుడి లోనుండి కదల క పోతే బలవంతంగా తీసుకు వెళ్ళాల్సి వచ్చింది . పెళ్ళి వేడుకలన్నీ ముగిసీ
అత్త గారింట కాలు పెట్టిన కృష్ణ వేణికి అంతా కొత్తగా వుంది .
“ఎవరికీ పూజ గురించిశ్రధ్ద వుండేది కాదు .లేచిన దగ్గర నుండి ఆఫీసులకు పరుగెత్తే సందడి లోనే వుండేవారు.ఎవరూ ఉదయమే లేచే వారు కాదు .
అత్త గారున్నా ఆవిడ ఏమి పెద్ద గా పట్టించుకోదు .రాత్రిళ్లు చాలా ఆలస్యంగా
ఇంటికి వచ్చే వాళ్ళు .
నారాయణ కూడా ..అంతే..నారాయణకు చాలా వ్యసనాలు వుండేవి .అవి దాచి పెట్టి పెళ్ళి చేసారు .రాను రాను కృష్ణవేణి పరిస్థితి ఆ ఇంట్లో పని మనిషిగా మారిపోయింది .చాలా దిగులు పడి పోయింది కృష్ణ వేణి …మనిషి ఆకారం మారి పోయింది .మధ్య మధ్య లో చూడటానికి వచ్చిన. రామకృష్ణ దంపతులకు కృష్ణ వేణి పరిస్థితి పూర్తిగా అర్థమైంది .ఏమి చేయాలో తోచలేదు .మనసు నిండా చెప్పలేని బాధ నింపుకుని వెళ్ళే వారు.
అలాంటి సమయం లో కృష్ణ వేణి నెల తప్పింది.
పిల్ల చాలా నీరసంగా వుంది .కన్నాక పంపిస్తామని వెంట పెట్టుకు తీసుకొచ్చారు .కృష్ణ వేణి లో వెనుకటి ఉత్సాహం లేదు .
అత్తింటి నుండి కనీసం కుశలం కూడా ఎవరూ అడగ లేదు .మెల్లిగా కృష్ణ వేణి తేరుకున్నా మునుపటి లా లేదు .కూతురును చూసి ఇద్దరూ దిగులు పడి పోయారు .
ఊరివారు కూడా కృష్ణ వేణిని చూసి చాలా బాధ పడ్డారు .
“భగవంతుడికి న్యాయం లేదన్నారు .చిన్నప్పటినుండి అంత భక్తిగా సేవలు చేసిన పిల్ల బ్రతుకు ఇలా చేసాడని బాధ పడ్డారు .
మెల్లిగా గుడి మండపంలో కూర్చొని చిన్ని కృష్ణుడిని చూస్తూ కూర్చునేది .
అలా నెలలు నిండి ఒక తెల్లవారు ఝామున చక్కని మగ పిల్ల వాడిని కన్నది .
ఇంటిల్లి పాది ఎంతో సంబర పడ్డారు .
చాలా రోజుల తర్వాత కృష్ణ వేణి పెదవులపై నవ్వు కళ్ళల్లో వెలుగు , జీవితం పై ఆశ కనుపించాయి .పెద్దాయన పేరు కృష్ణయ్యపేరు కలిసి వస్తుందని కృష్ణమాచార్యులని పేరు పెట్టారు .
అత్తవారికి. కబురు పంపినా ఎవరూ రాలేదు ఎలాంటి కబురు లేదు .
“ఇక వాళ్ళు వచ్చినా నా బిడ్డను ఆ నరకానికి పంపను అని తేల్చి చెప్పేసాడు రామకృష్ణాచారి
ఇంక వాడి ఆలనా పాలన లో అందరికీ క్షణం తీరిక వుండటం లేదు .
కృష్ణ వేణి కూడా మెల్లిగా మామూలు మనిషయ్యింది .కొడుకుని కన్నయ్యా అని ఎంతో ముద్దుగా పిలుచు కునేది . వారసుడి గురించి బాధ పడే తండ్రికి చెప్పిం ది . “నేను నాబిడ్డే ఈ చిన్ని కృష్ణుడి , వేణు గోపాలుడి కైంకర్యానికి వారసులం .”
“నేను ఏ జన్మ లో చేసిన పాపమో కొద్ది రోజులు నా కర్మకు ప్రాయశ్చిత్తం చేసాడు” ఈ వేణు గోపాలుడు .అందులో కూడా నాకు పరి పూర్ణతను ఇచ్చాడు .
హిరణ్య కశిపుడి కడుపున ప్రహ్లాదుడు పుట్టినట్లు .నా బిడ్డ జన్మకు అతడిని కారకుడిని చేసాడు . అందుకే నన్ను నా బిడ్డను మళ్ళీ తన సేవ కోసం పిలిపించుకున్నాడు .
“ ఏ ఆగమ శాస్త్రం అడ్డు వచ్చినా వేణు గోపాలుడే చూసుకుంటాడు .
నన్ను నా కన్నయ్యను ఇక్కడ నుండి ఎవరూ కదిలించ లేరు “ ఎంతో ధృఢంగా చెప్పింది కృష్ణ వేణి .”
కూతురు మాటలతో తల్లి తండ్రి ధైర్యం తెచ్చుకున్నారు .ఊరట చెందారు ఆయనే చూసుకుంటాడని …ఎదురుగా వున్న కన్నయ్య లో బాలకృష్ణుడిని చూసుకుంటున్నారు .
కన్నయ్యకు మూడు సంవత్సరాలు నిండాయి .వాడు చిన్నప్పటి కృష్ణ వేణిని తలపిస్తూ అందరినీ మురిపించేవాడు .
కృష్ణ వేణి మునుపటి కంటే ఉత్సాహంగా వుంటుంది .ఆతల్లి కొడుకుల ఆటపాటలన్నీ ఆలయంలోనే . వారిద్దరి ఆటలు అందరికీ యశోదా కృష్ణులను
తలపిస్తూంది .
“నమ్మిన వాళ్ళ చేయి భగవంతుడు విడువడు అనే నమ్మకమే
మనిషికి ధైర్యాన్నిస్తుంది “ కృష్ణ వేణిని చూసిన అందరికీ కృష్ణ వేణి ధైర్యం అర్థమయింది .”

“సర్వే జనా సుఖినోభవంతు”

About the author

vgadmin

Add Comment

By vgadmin
Language