
గజల్ విజయ గోలి
పాలకడలి పాలవెల్లి పుట్టినావెశ్రీలక్ష్మిగ
విష్ణునింట మారాణిగ మెట్టినావె శ్రీ లక్ష్మిగ
చందమామ తోడబుట్టి అందమంత నీ సొంతమె
ఆనందిని నీవుగాను వెలసినావె శ్రీ లక్ష్మిగ
శ్రీవాణివి శ్రీ గౌరివి శ్రీచక్రిణి పద్మేశ్వరి
శంఖచక్ర గధాహస్తి మెరిసినావె శ్రీ లక్ష్మిగ
ఐశ్వర్యపు అధిదేవత ఆదరించు వరములిచ్చి
పైడిమువ్వ సవ్వడితో తరలిరావె శ్రీ లక్ష్మిగ
చందనాది పరిమళాల నీపూజలె చేసేముగ
మంగళమని పాడేములె కదిలిరావె శ్రీ లక్ష్మిగ
సింధూరపు వర్ణముల సౌభాగ్య దాయినిగా
అలసిపోని అపరాజిత సిరులివ్వవె శ్రీలక్ష్మిగ
ప్రతిఇంటన పడతిరూపు నీవేకద విజయముగా
అష్టలక్ష్మి సౌందర్యగ నిలిచిపోవె శ్రీలక్ష్మిగ