హసితం

శుభోదయం🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి

మరులు విసురు మల్లెలోని వర్ణమేగ నీ హసితం
అమావస్య అడ్డుపడని పున్నమేగ నీ హసితం

నయనములే కమలములై కలయతిరుగు నాట్యంలో
వేడుకగా వేటాడే మధుపమేగ నీ హసితం

నీలాంబర చేలంలో నిండివున్న జరీపూలు
తన్మయమై తళుకులొంపు తారలేగ నీ హసితం

తరువునీడ సేదతీరు తనువు తాకి తాపమార్పు
తెమ్మెరగా తరలివచ్చు గంధమేగ నీ హసితం

తీరమెంత దూరమైన ఎదలోపలి ప్రతిరూపుగ
దారిచూపు కనుపాపల విజయమేగ నీ హసితం

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language