గజల్ విజయ గోలి
ప్రేమ బాస చేసి చూడు బంధ మెంత సుందరమో!
పదము కలిపి నడిచి చూడు పయన మెంత సుందరమో!
మనసులోని మంటలనే మార్చిచూడు మల్లెలుగా
పలుకులలో పంచదార చిలుక లెంత సుందరమో!
చిరాయువుగ యోగమంటె నవ్వులదే ఆ భాగ్యం
నగుమోమున చిరునవ్వుల చిందులెంత సుందరమో!
వింత వింత లోకంలో విలువైనది మనుజ జన్మ
ద్వేషాలను విడువమన్న గ్రంధ మెంత సుందరమో!
కులమతాల కుళ్ళు ముళ్ళు గుచ్చుతుంటె ముప్పేగా…
మానవతే మతమైతే మనుగడెంత సుందరమో!
ఎదుటి వాని గుండెలపై కాలుపెట్టి ఎదుగుటేల
పదుగురికై పాటుపడే పధము లెంత సుందరమో !
చరితలోన చెరిగి పోని సంతకమే నీదైతే…
కాలానికి ఎదురు నిలుచు “విజయ “మెంత సుందరమో!!