శ్రీతరం గారు

నా చిన్న స్పందన
***********

విజయ గోలి మేడం గారు ఎంతో అభిమానంతో
“నా కల- నా స్వర్గం” అనే కవితా సంపుటి పంపించారు. వారికి ముందుగా ధన్యవాదాలు,శుభాకాంక్షలు

విజయ గోలి గారు చక్కటి గజల్స్ రాస్తూ… గజల్ కవయిత్రి గానే పరిచయం అయ్యారు కానీ ఈ మొదటి వచన కవితా సంపుటి చదువుతుంటే అటు గజల్స్ ఇటు వచన కవిత్వం రెండింటిలో అందెవేసిన చెయ్యి అమెది అని అర్థమవుతుంది. ఇవే కాకుండా రుబాయీలు, నానీలు, కథలు, వంటి అనేక ప్రక్రియల్లో వారికి ప్రవేశం ఉందని తెలుస్తోంది.
విజయ గోలి గారు అనుభూతులకు అనుభవాలను జోడించి తనలోని భావోద్వేగాలను పదాలుగా కూర్చి సాహితీ మాలలను కట్టారు, సమాజంలోని పోకడలను చూస్తూ, తన వంతుగా స్పందిస్తూ, ప్రశ్నిస్తూ, పెద్ద పెద్ద పదబంధాలు, హంగులు, ఆర్బాటాలేవి లేకుండా సరళంగా సూటిగా సహజత్వానికి పెద్దపీట వేస్తూ, నూతనత్వంతో తన కంటు ఉన్న ప్రత్యేక శైలి లో కవితీకరించారు.

రాజశేఖరుడు అనే అలంకారికుడు కవులను మూడు రకాలుగా పేర్కొన్నాడు. సారస్వతుడు,అభ్యాసకుడు,ఔపదేశికుడు.
సహజ ప్రతిభ గలవాడు సారస్వతుడు అంటాడు, సహజ ప్రతిభ జన్మాంతర సంస్కారం వల్ల ఉద్భవిస్తుంది. ఈ కోవలోకి వస్తారు అనిపిస్తుంది విజయగోలి గారు.

కవిది జ్ఞాననేత్రం అంటారు చూపు సూర్యుని కిరణాలు కంటే తీక్షణమైంది. సూర్య కిరణాలు ప్రవేశించడానికి అడ్డంకులున్నాయి కాని కవి చూడడానికి అవరోధాలుండవు కనుకనే రవిగాంచనిచో కవిగాంచును అనే నానుడి ఏర్పడింది. ఇక్కడ కవయిత్రి గారి చూపు చాలు తీక్షణమైనది అని కవితలన్నింటినీ పరిశీలిస్తే అవగతం అవుతుంది. సామాజిక దృక్కోణాన్ని, దేశంపై భక్తి, ప్రేమ,దేశ నాయకుల మీద గౌరవం, స్త్రీ శక్తిపై విశ్వాసం, సాధికారత , పర్యావరణంపై స్పృహ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని, ఆలోచనలు రేకెత్తించే అభ్యుదయ భావాలతో అనేక కోణాల్లో అక్షరీకరించారు. అలాగే బాల్యపు మధుర స్మృతులను, అంతరంగంలో ఉన్న సంవేదనను ఉన్నతంగా చిత్రీకరించారు.

// ఇది నా కవన కుటీరం…
ఇక్కడ నా భావాలు మాత్రమే పరిమళిస్తాయి
ఇక్కడ నా పదాలు మాత్రమే పల్లవిస్తాయి…//
అంటూ తన భావ పరిమళాన్ని పుస్తకంలో గుమ్మరించారు

// కాలుష్యమే లేని కవన పవనాల
పన్నీటి పలుకరిపులు మాత్రమే ఉంటాయి…

చెంగల్వలంత స్వచ్ఛమైన చెలిమి ఒక్కటే ఇక్కడి కలిమి
పువ్వు లాంటి నవ్వులు తప్ప నటనలుండవు
ఇక్కడ భూపాల రాగాలు కిలకిలలు కువకువలు
వెండి వెన్నెలలు వేణు గానాలు అన్నీ నా సొంతం…//
నిజంగా కవితల్ని చదువుతుంటే సహృదయ పాఠకులకు కూడా అన్నీ సొంతంగా అనిపించేలా
అద్భుతంగా ఆవిష్కరించారు.

ఇది నా కల…నా స్వర్గం..!

//ఎవరైనా నా ఆవరణలోకి రావాలనుకుంటే
పాదరక్షలు బయట విడిచి రండి
దయచేసి నా కలని కబ్జా చేయకండి//
అంటూ కవయిత్రి గారు సుతిమెత్తని తన కలలను ఎవరు కబ్జా చేయకండి పాదరక్షలతో మలినం చేయకండి అని వాచ్యార్థంలో, వ్యంగ్యాన్ని వ్యక్తపరిచారు.

అలాగే మరో కవిత “యుగళ గీతం” లో
//ఎప్పుడైనా ఒంటరిగా
ఆకాశాన చుక్కలు లెక్క వేసావా
అందులో ఒక తార చిటపట లాడుతుంది చూసావా
ఆ తారను నేనే… అంటున్నారు
అంతే కాదు చల్లని అల్లరి గాలిని పిల్లగాలి నేనే
ఆ గుండె సవ్వడి నేనే, చెక్కిలి తడిపే అశృధార నేనే,ఆ ప్రశాంత సంధ్యను నేనే…
నీలో అణువు అణువు నిండిన నీ ఉనికిని నేనే
నీ మనసు పాడే యుగళ గీతం నేనే… అంటూ చక్కటి భావుకత నిండిన అందమైన ఊహలా, పాటలా పదాలను అల్లేశారు.

// మౌనం ఎప్పుడూ
మాటలకందని భాషేమి కాదు
రెండు మనసుల నిండు ప్రేమల పాటే ఒకసారి//
అవును కవయిత్రి గారు అన్నట్లు మౌనం కూడా మాట్లాడగలదు,పాడగలదు కొన్నిసార్లు ముఖ్యంగా రెండు మనసుల మధ్య మౌనం అలౌకికమైన భాష దానికి మాటలు కూడా సరిపోవు ఒక్కోసారి.

“వాక్యం రసాత్మక కావ్యం” అన్నట్లుగా అప్పగింతలు అనే కవితలో గుండెలవిసి పోయే అమ్మ నాన్న, అన్నదమ్ముల అనుబంధం ఆద్రతతో చిత్రీకరించారు.

అలాగే గత వైభవ స్మృతి ఛాయలు అనే కవితలో
// స్వర్ణయుగపు పునాదులపై
దేశమాతకు సమాధి కడుతున్న
వర్తమానం తలుచుకుంటూ భవితనూహించలేక
మూసిన నా కనురెప్పలు వెనక కదులుతున్నాయి…// అంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అభివృద్ధి ముసుగులో అంతా ప్రకృతిని, సహజవనరులను నాశనం చేస్తూ మానవుని ప్రవర్తన రోజు రోజుకు మితిమీరిపోతుంది. నిజంగా గత వైభవ తలుచుకుంటే కలవరంతో రెప్పలు విప్పలేము.

ఇలా పుస్తకంలో కవితలన్నీ ఒకదానిని మించి ఒకటి అన్నట్లుగా 69 కవితలు ఉన్నాయి నిజంగా కవితలన్నీ చాలా బాగున్నాయి. నిషిక బ్యాకోడ్(USA) గారు గీసిన ముఖచిత్రంతో పుస్తకం ఆకర్షనీయంగా ఉంది. విజయ గోలి మేడం గారు మీరు ఇలాగే మునుముందు కూడా మంచి కవిత్వాన్ని అందించాలని, ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని సాహితీ క్షేత్రంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ శుభాభినందనలు తెలియలిజేస్తున్నాను.

శ్రీతరం ✍️ — with Vijaya Goli.

About the author

vgadmin

Add Comment

By vgadmin
Language