యుగళగీతం

శుభోదయం 🌹🌹🌹🌹🌹

*యుగళ గీతం విజయ గోలి

ఎపుడైనా ఒంటరిగా …
ఆకశాన చుక్కలు లెక్క వేసావా
అందులో ఒక తార చిటపట లాడుతుంది చూసావా
ఆ తారను నేనే

ఎపుడైనా మౌనంలో
నిన్ను నీవు మరిచి పోయావా
అపుడొక చల్లని అల్లరి గాలి నిను చుట్టేస్తుంది
ఆ అల్లరి పిల్ల గాలి నేనే

ఎపుడైనా నీ మనసుగది
తలుపులు తీసావా తలపులు సవరిస్తూ
చిరు మువ్వల సడి ఒకటి మైమరపిస్తుంది
ఆ గుండె సవ్వడి నేనే

ఎపుడైనా ఉదాసీనంగా
శూన్యంలో నీ చూపులు చిక్కడి పోయినపుడు
నీకు తెలియకనే అశృధార నీ చెక్కిలిని తడుపుతుంది
ఆ అశృధార నేనే

ఎపుడైనా ఊహలలో
నీలో నువ్వే నవ్వుకుంటూ కూర్చున్నావా
అపుడు నీ మది అందమైన పాట పాడుతుంది
ఆ పాట పల్లవి నేనే

ఎపుడైనా సంధ్యా సమయంలో
సముద్ర తీరంలో కనిపించినంత మేర అలా చూస్తు నిలబడ్డావా
అపుడు నీ మనసులోని ప్రశాంతత ఎవరనుకున్నావు
ఆ ప్రశాంత సంధ్యను నేనే

నీలో అణువు అణువు నిండిన నీ ఉనికి నేనే
నీ మనసు పాడే యుగళ గీతం నేనే ..

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language