శుభోదయం 🌹🌹🌹🌹🌹
శ్రీమతి వసుధా దేవి తిరుమల
ముఖ పుస్తకంలో ఆత్మీయమైన స్నేహితులలో ఒకరు .
మంచి విద్వత్తు
విషయ పరిజ్ఞానము వున్న. కవయిత్రి.
నా గజల్ సంపుటాలు
*పిల్లన గ్రోవి
* చిత్రవీణ
ఇంతకు ముందు *చిత్రవీణ పై అత్యద్భుత మైన సమీక్ష చేసారు .
అలాగే ఇపుడు తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి *పిల్లనగ్రోవి పై చక్కని విశ్లేషణాత్మక సమీక్ష చేసారు ..
వారి ఆత్మీయ అభిమానానికి హృదయపూర్వక. ధన్యవాదాలు 🙏🏻🙏🏻
ఈ రోజులలో ఇతరుల పుస్తకాలు చదివి సమీక్షగా వ్రాసి స్పందన. తెలిపేవారు
ఎంత మంది వుంటారు .. అలాంటి. అరుదైన వారిలో వసుధ గారు ఒకరు.
దాదాపుగా నా పుస్తకాలు అందుకున్న ఆత్మీయ మిత్రులందరూ సమీక్ష రూపంగా తమ స్పందనలు తెలియ చేసారు .వారందరికీ కూడా నా హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏🏻🙏🏻
వసుధ గారి సమీక్ష పై మీ అమూల్యమైన స్పందనలు తెలియ చేస్తే
మా ఇరువురికి. ఆనందం 🌹🌹🌹🌹🌹
మీ
విజయ గోలి
పిల్లనగ్రోవి- “విజయ”రాగమోహనం
సమీక్ష
వనమాలి అంటే ఉన్న ప్రత్యేకమైన ఇష్టమే
ఇలా “పిల్లనగ్రోవి”గా పిలిచి నాచేత ఈ గజల్
కావ్యం రాయించింది.. ఆమురళీధరుడే నా చేయిపట్టి రాయించాడని గట్టి నమ్మకం కలిగింది అంటూ తన అంతరంగ ఆవిష్కరణ చేసిన “పిల్లనగ్రోవి” రచయిత్రి
శ్రీమతి విజయగోలి గారు ముఖపుస్తక మిత్రులుగా కొద్ది కాలంగా పరిచయం..
వారి రచనలు “చిత్రవీణ”,”పిల్లనగ్రోవి” లను అందుకోవటం సంతోషం కలిగింది..
కృష్ణప్రేమకు రూపమే రాధమ్మ
రాధ నిలువెత్తు స్వరూపమే ప్రేమతత్వం!
పుస్తకం లోని గజల్స్ చదువుతుంటే
జయదేవుని అష్టపదులలో, మీరా భజనలలో నిండిన పరమాత్ముడగు రాధామాధవ రాసలీలామృతం,
మధురభక్తి.. మళ్ళీ విజయగోలి గారి
“పిల్లనగ్రోవి” గజల్స్ గా అలతి పదప్రయోగ
అలంకరణలతో..
రాధామాధవ ప్రణయ మనోహరమై..
మన ముందుకు వచ్చినట్లు అనిపించిది
మధురమైన మత్లాలు తన కలం నుంచి
అలవోకగా జాలువారుతాయి అంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు మీరే చూడండి కొన్ని మత్లాలు..
“కనులు మూసిన కలికి నవ్వులు ఏటిగాలుల
ఎగసివచ్చె!.. మువ్వ సవ్వడి ముందుగానే
గువ్వ పలుకుల ఎగసివచ్చె!” ఇది మొదటి గజల్ లోని మత్లా.. సెలయేటి పై వీచే గాలులలో నవ్వుల సడినీ,మువ్వ సవ్వడిని గువ్వ పలుకులలోనూ చూడ గలిగిన భావన మధురం కదా!.. “మల్లెలార మౌనమేల
పిలిచినాడు మాధవుడే!.. జాజులార జాగేలా
తలచినాడు మాధవుడే!”.. అనే మత్లాతో మరో గజలంతా మధుమాలతి,విరజాజులు,
సంపెంగలు,రెల్లుపూల పరిమళాల జల్లుకురిపించారు ఒక్కో గజల్ ఒక ప్రత్యేకతతో రాశారేమో అనిపించింది
“నీతలపున మోహనమై విరిసెనులే దరహాసం!.. నీవలపుల కళ్యాణిగ మెరిసెనులే దరహాసం!”.. ఈమత్లాతో మొదలైన గజలంతా భూపాలం,కీరవాణి,
హిందోళం,నీలాంబరి,హంసధ్వని రాగమాలల విహరించి దరహాసంతో అలరించారు..”పూలబాస తెలుసుంటే పువ్వులాగ నవ్వేవు! మనసుభాష
ఎరిగుంటే మౌనాన్నే వీడేవు” అంటూ
రాధిక తన మదినిండిన మాధవుని సున్నితంగా ఆక్షేపిస్తూ.. పూలబాస తెలిస్తే
పూవులాగ స్వచ్ఛంగా నవ్వేవాడివనీ,
మనసుభాషతెలిస్తే మౌనంవీడి మాటలతో మురిపించేవాడివనీ “దాగున్నవి గుండెలలో దాచలేని ప్రేమలే” అని పలికించడంలో పరిపూర్ణత చెందిన ప్రేమతత్వం కనిపిస్తుంది
మరో మత్లా”చిత్తమందు చిలిపివూహ
ఉత్తరమే రాయమంది.. చిరుగాలుల అల్లరేదొ
చిత్తరువే గీయమంది”.. ప్రణయ విరహిణి
అయిన రాధిక ఊహలలోని చిలిపి అల్లరులు
ఎంతబాగా అభివర్ణించారు.. వస్తువులోకి
పరకాయ ప్రవేశం చేస్తేనే కానీ కవిత్వం పండదు అనే రచయిత్రి అభిప్రాయం
చక్కగా ప్రస్ఫుటమవుతుంది “పిల్లనగ్రోవి”
రచనకు రాధికలో ప్రవేశించినట్లే అనిపిస్తుంది
“నందన వనమున విరిసిన సుమాల హాసమె అందం.. విరులను తాకుతు తుమ్మెదలాడిన
సరసమె అందం” ఈగజలంతా దోబూచుల చందం తో అందంగా సాగింది
“మన్నేదన చిన్నినోట భువనమాడ
అచ్చెరువే.. కాళిందుని పడగలపై నాట్యమాడ అచ్చెరువే!” మంచిరదీఫ్ తో
గజలంతా కృష్ణుడి చేష్టలను వర్ణించటం సరిగ్గా అమరిపోయింది.. నిజమేకదా! కృష్ణలీలలు ప్రతి సన్నివేశమూ ఆశ్చర్యకరమే! అమితానందమే!
“కనురెప్పల కుంచెలతో వర్ణలేఖ వ్రాస్తున్నా..
ప్రణయాలే పల్లవిస్తు ప్రేమలేఖ వ్రాస్తున్నా!”
వర్ణమయమైన కలలన్నింటినీ కను రెప్పలనే కుంచెలుగా వాడి వర్ణరంజితంగా ప్రేమలేఖ రాయటం సుందరమైన వర్ణన బాగుందికదా!
“చిగురించే అల్లికలో జారిపోవు తీగలేగ..
వమ్ముకాని నమ్మకాల హస్తరేఖ వ్రాస్తున్నా!”
ఇందులోని ఈషేర్ ఎంతబాగుంది చిగురించే
సమయంలో ప్రేమలు జారిపోనీయక
ప్రమాణపూర్తిగా నమ్మకాలను హస్తరేఖగా
రాస్తున్నాననటం ఎంత అద్భుతం.. హంసలేఖ,చంద్రలేఖ,శుభలేఖ ఎంచుకున్న
కాఫియాలు చాలా బాగున్నాయి 42గజల్స్ లో ప్రతి గజల్ కూడా రాధమ్మ అణువణువునానిండివున్న కృష్ణప్రేమ, రాసకేళి.. రచయిత్రి కలంనుంచి మధురభక్తిగా జాలువారి గజల్ కావ్యంగా
రూపుదిద్దుకుంది.
ఇంకొక అద్భుతాన్నికూడా ఈ గజల్ సంపుటిలో చూడవచ్చు రాధమ్మను..
భరతముని నాట్యశాస్త్రంలోని
అష్టవిధ శృంగార నాయికగా కూడా
అభివర్ణించారు కవయిత్రి..
“పుణ్యమెంత చేసినావొ పూలనింపు నిన్ను జేరి.. గోవిందుడె దాసుడాయె ప్రేమనింపు నిన్ను జేరి” అంటారు.. తొలినాయిక “స్వాధీన పతిక”అయిన రాధమ్మతో..
“వాసకసజ్జిక”తో “కనుపాపలను దీపాలుగ
వాకిటనిలపటం”.. “తనువంతా ధనువాయే
తరుణినేల రావేలా” అని విరహోత్కంఠిత”ను
చూపించారు.. “మాయగాడ మరలిరాకు
మోసపోతి నినుకోరి”అని “విప్రలబ్ద”తో
పలికించి.. “రమణిమనసు తెలియలేని
రాలుగాయి కాదుకదా రాడేలని రచ్చచేసి
రగులుతుంది ఏమైనదొ” అంటారు “కలహాంతరితతో “.. “వేచిలేరు స్వాగతించ
పడకటింట పానుపేసి.. వెడలిరండు” అంటూనే నీరైనను ఇవ్వలేదు.. కోపాలతొ వేధించగ” అని వేదనగా పలికించారు “ఖండిత”తో.. “ఎదురుచూపు ఎదలోపల
దిగులాయెను రాడేలనొ.. సందెకూడ సద్దుమణిగె గుబులాయెను రాడేలనొ”
అంటూ “ప్రోషిత భర్తృక”దిగులు వర్ణించారు..
“తలుపుమూసి మేలిముసుగు మోముదాచి
రాధమ్మా అదురుబెదురు చూపులతో
అరుదెంచెను మైమరపుల” అంటున్న రాధమ్మను “అభిసారిక”లా వర్ణించారు…
అద్భుతమూ,అపురూపమూ అయిన
గజళ్ళతో రాధామాధవీయమైన
“పిల్లనగ్రోవి” సంపుటి విజయగోలి గారికి
విజయాన్ని కలిగించి శ్రీకృష్ణపరమాత్ముడు
ఆయురారోగ్య ఐశ్వర్యాలను పెంపొందించాలని అభిలషిస్తూ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను 💐💐💐💐💐
వసుధాదేవి తిరుమల
హైదరాబాద్