నీలిరంగు లంగా ,ఓణీ”      

నీలిరంగు లంగా ,ఓణీ     

రచన.       విజయ గోలి

ఉదయం తొమ్మిది గంటలైంది అందరూ హడావిడిగా  ఆఫీసులకు స్కూళ్ళ కు

వెళుతున్నారు.రోడ్డంతా బస్సులు ఆటోలు కార్లు వాహనాలతో  నిండి పోయింది .రోడ్డుకు అవతల వైపు బస్సుదిగి  వాహనాల మధ్యలో నుండి

చాలా కష్టపడి  మొత్తానికి  రోడ్డు దాటి  టైమ్ చూసుకుంది .9.30 ముఖంలో కంగారు,గుండె దడ పెరిగింది.ముఖాన పట్టిన చెమట తుడుచుకుని,తల చేతి తోనే పైపైన సరి చేసుకుని షాపు మెట్లు ఎక్కింది జ్యోతి . ఎదురుగా మేనేజరు జ్యోతిని  చుస్తూనే చేయి వంక టైమ్ చూసుకుని సీరియస్‌ గా చూసాడు .ఆయనకి గుడ్మార్నింగ్ చెప్తూనే పుస్తకంలో సంతకం చేసి మెయిడ్ రూము వైపు పరిగెత్తింది . గబ గబా యూనిఫారం  మార్చుకుని

బయటకు వచ్చింది అప్పటికే అందరూ ఎవరి పనుల్లో వాళ్ళున్నారు .బకెట్ మాపు కర్ర తీసుకుంది. అప్పుడుగుర్తొచ్చింది జ్యోతి కి అటూ ఇటూ చూసి మాపు చేసే వంకతో ఎంట్రన్స్ దగ్గర కెళ్లి చూసింది. ముఖం లోఆనందం ..ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది .అక్కడే వుంది .ఇంతలో నీ డ్యూటీ  పైన అయితే ఇక్కడేంచేస్తున్నావు మేనేజర్ గొంతు గట్టిగా వినిపించింది .

ఉలిక్కి పడిన జ్యోతి మర్చి పోయాను సర్ అంటూ తడబడుతూ పైకి నడిచింది.క్రింద నుండి మేనేజరుగొణుగుతున్నాడు వినిపిస్తూంది.

జ్యోతిని చూసి నవ్వింది వసుమతి. తనతో పని చేసే అమ్మాయి .

ఆలస్యమైందేమిటి అంటూనే  అక్కడే వుంది చూసావా అంటూ అడిగింది.

నవ్వుతూ  చెప్పింది  తల వూపుతూ.

తొందరగా కానీయండి అంటూ సూపర్వైజర్  రాణి గట్టిగా అరిచింది .

ఇద్దరు తలవంచుకుని మాపు చేయటం మొదలు పెట్టారు .

అది పట్టణం ముఖ్య కూడలిలో వున్న ప్రఖ్యాత మహిళల బట్టల షాపు అక్కడ అన్ని బ్రాండెడ్  తప్పమామూలు బట్టలు వుండవు .పెద్ద పెద్ద వాళ్ళు

సరదాగా షాపింగ్ చేసే చోటు. అక్కడ పని చేసే పదిమంది ఆడపిల్లల లో జ్యోతి ఒకటి.వసుమతి కూడాఅక్కడే జ్యోతి కంటే కొద్ది నెలల ముందు చేరింది . తన దగ్గర చూస్తూనే పని నేర్చుకుంది .అలా ఇద్దరికీ స్నేహంకలిసింది.వయసు కూడా ఇద్దరిదీ ఒకటే కావటం కూడా కారణం . ఉదయం 9గంటల నుండి రాత్రి 8గంటలవరకు .మధ్య లో లంచ్ కొరకు 45 నిమిషాలు

నెలకు 7000 / . ఉద్యోగానికి కూడా చాలా కాంప్టీషన్ .టీనేజ్ ఆడపిల్లలైతే హుషారుగా చేస్తారని  16నుండి20 లోపు వారినే పనిలో పెట్టుకుంటారు .

మూడు నెలల క్రితం షాపులో చేరింది . సూపర్వైజర్  రాణి ద్వారా చేరింది జ్యోతి.

రాణి వాళ్ళ అమ్మకు ఎక్కడో దూరపు  చుట్టం . అందుకే రాణి అంటే భయం .

నెమ్మదిగా ,అమాయకంగా ,ఒదిగి వుండి చెప్పిన పని చక చకా చేసే జ్యోతిని

ఎవరూ గట్టిగా ఏమీ అనరు ..

జ్యోతి  అమ్మా ,నాన్న ,ఒక తమ్ముడూ వున్నారు . తమ్ముడు రవి 7వతరగతి చదువుతున్నాడు . తండ్రితిరుపతయ్య రోజువారి కూలీ కి వెళ్తాడు .వచ్చిన దానికి ఎదురు అప్పు చేసి మరీ తాగి వస్తాడు . తల్లియాదమ్మ చాలా కష్ట పడుతుంది. ఇళ్ళల్లో పనులు చేస్తుంది . ఇంటికి ఆమె తెచ్చే జీతమే ఆధారం .మూడు నెలల నుండి జ్యోతి జీతం కూడా కలవటంతో కొద్దిగా తేలిక పడింది .తండ్రి చేసిన అప్పులుతీర్చడానికి  ఎక్కడి డబ్బులు చాలటం లేదు. దేశం లో ఇలాంటి కుటుంబాలు ఎన్నో. మద్యానికి బానిసలైబాధ్యతలు మరిచి పిల్లల బాల్యాన్ని ,భవితను బానిసలుగా మార్చే తండ్రులు లెక్కకు మించే వున్నారు .మనదేశ దౌర్భాగ్యం.మన దేశ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు  అన్ని  మద్యం ప్రదానంగా సాగుతాయి .దానిని అరికట్టేఉద్యమాలు ఎక్కువ కాలం నిలబడవు .

జ్యోతి  8 తరగతి వరకు చదువుకుంది. చదువు కోవాలనే కోరికని చంపేసుకుని 4 యేళ్ళు అయింది.అప్పటినుండి ఇంట్లో పనిచేయటం వాళ్ల అమ్మకి  ఇళ్ళల్లో పని సాయం చేయడం ,వయసు చిన్నదైనాబాధ్యత తెలిసి నడుచు కుంటుంది .తమ్ముడిని స్కూలుకు పంపటం  ఇవన్నీ జ్యోతి డ్యూటీలో భాగాలు.బయటికి వెళ్లి  పని చేయడం జ్యోతి తండ్రికి ఇష్టం లేదు . అందుకే చదువు మానిపించి ఇంట్లో కూర్చోపెట్టాడు .

మన దేశపుదౌర్భాగ్యం .స్వాతంత్ర్యం వచ్చి వజ్రోత్సవాలు చేసుకుంటున్నా .

ఆడపిల్లలు ఆకాశం  లో  సంబరాలు చేస్తున్నా బడుగు వర్గాల్లో  ఆడపిల్లల జీవితాలు అధఃపాతాళం లోనేవున్నాయి .

ఇలాంటి  అభిజాత్యపు కలుపు మొక్కల వేళ్ళు  ఎంతో బలంగా  దిగబడి వున్నాయి . రాణి బలవంతం మీదఎంతో చెప్పగా ఇష్టం లేకుండానే ఒప్పుకున్నాడు .ప్రతి నెలా వస్తున్న జీతం చూసి మాట్లాడ కుండా  వున్నాడు. జీతం వచ్చిన రోజున తండ్రి  డబ్బుల కోసం చేసే గోల మామూలుగా వుండదు . విషయం లోయాదమ్మ  మొగుడికి పూర్తిగా ఎదురు తిరిగింది .పైసా ఇచ్చే ప్రసక్తే లేదని ఖచ్చితంగా చెప్పటంలో చేసేది లేకవూరుకున్నాడు.అయినా ప్రతి నెలా గొడవ చేస్తూనే వుంటాడు ఇక్కడ పని చేసే ఆడపిల్లల  కుటుంబనేపథ్యం దాదాపుగా అందరిదీ  జ్యోతి నేపథ్యం లాంటిదే . ఉద్యోగంలో చేరాకా కూడా వీలైనంతగా ఇంట్లోపని చేసి వస్తుంది .

పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి  కొనబోయే బట్టలు వేసుకుని చూసుకుని ట్రయల్ రూమ్‌లో  పడేసి వెళ్లిన బట్టలన్నీమడతలు వేసే టపుడు వాటిని తాకుతున్నపుడు చాలా విస్మయంగా వుండేది.వేసుకుని చూసుకునే వాళ్ళనిచూసినపుడు సినిమా యాక్టర్ లని చూసినట్లు చూసేది. కానీ ఎపుడు అలాంటి బట్టలు తను కూడావేసుకోవాలని ఊహించుకోలేదు ఆశపడ లేదు .

కొత్త డ్రస్సులు వచ్చినపుడు  డ్రస్సులు బొమ్మలకు అలంకరిస్తున్నపుడు

చూడటం ఆనందంగా వుంటుంది.ఇవన్నీ షాపులో జ్యోతికి ఇష్టమైన విషయాలు.

మూడు నాలుగు నెలల కు ఒకసారి  సేల్ పెడతారు . అందులో ప్రస్తుత రేట్ల కంటే తక్కువకు అమ్ముతారు. అపుడు జనం బాగా వస్తారు.జ్యోతి వచ్చిన తర్వాత  సేల్ పెట్ట లేదు .ఇంకో నెలలో వుంటుందని వసుమతిచెప్పింది.అపుడు పని చాలా ఎక్కువ వుంటుందని ఎక్కువ పని చేసినందుకు డబ్బులు కూడా.ఇస్తారనివసుమతి చెప్పింది. అప్పటినుండా సేల్ కోసం ఎదురు చూస్తుంది.ఎలా వుంటుందో చూడాలని వుత్సుకత.

  నాలుగు రోజుల క్రితం షాపుకు క్రొత్త స్టాక్ వచ్చింది.బొమ్మలన్నిటికీ క్రొత్త డ్రస్ లు మారుస్తున్నారు.సమయంలో  ఒక లంగా ఓణీ డ్రస్  జ్యోతి కళ్ల ల్లో పడింది.నిండు నీలి రంగు పైన సన్నని జరీ చుక్కలతో  లంగాచాలా అందంగా వుంది.చూడగానే కళ్ళల్లో  పడుతుంది.దాని పైన వెండి లా మెరుస్తున్న ఓణి ..నిండు నీలంరంగు పైన అందమైన వర్క్ చేసిన జాకెట్ దగ్గరగా వెళ్ళి ముట్టుకుని చూసింది ,మల్లె పూల మాలపట్టుకున్నంత  మెత్తగా సున్నితంగా వుంది.ఎవరు కొనుక్కుంటారో ఎవరు కట్టుకున్నా దేవతల్లా వుంటారనిమురిసి పోయింది .

వసుమతి  తను ఇద్దరు డ్రస్ గురించి మాట్లాడు కున్నారు.ఇద్దరు కలిసి దాని ప్రైస్ టాగ్ చూసారు..12000/ రూపాయిలు వుంది ..అమ్మో!! అను కున్నారు.పని వున్నా లేకపోయినా  పక్కకు వెళ్ళి డ్రస్చూసి వచ్చే వాళ్ళు .అవకాశం వున్నపుడల్లా దాన్ని తాకి ఆనంద పడే వాళ్లు.

నాలుగు సంవత్సరాల క్రితం ఒక లంగా ఓణీ అమ్మమ్మ కొనిపెట్టింది.అంతే మధ్య కాలంలో కొత్త బట్టలుచూడనే లేదు .పని చేసే వాళ్ళు  ఇచ్చే బట్టలతో నే

రోజులు గడుస్తున్నాయి.కానీ ఎందుకో  లంగా ఓణీ కళ్ళ ముందు నుండి పక్కకు పోవటం లేదు.

రోజు రాత్రి నిద్రలో కలలో కూడా లంగా ఓణీ కళ్ళ ముందు నాట్యమాడింది.ఆడపిల్లలలో వున్నసహజమైన ఆశ జ్యోతి మనసు మూలల్లో

కదిలింది . లంగా ఓణీ తను వేసుకున్నట్లు  ఇంటిల్లి పాది కొత్త బట్టలు వేసుకుని దీపావళి  పండుగసంబరంగా చేసుకున్నట్లుగా కల కంటూ నిదుర పోయింది .

తెల్లవారి షాపుకు వెళ్తూనే డ్రస్ వుందా లేదా అని చూడటం ఈరెండు మూడు రోజులుగా  అలవాటైంది.చాలా మంది చూస్తున్నారు కాని ఎందుకో దానిని తీసుకో వటం లేదు.రెండు రోజుల్లోమార్చేస్తారు.

రోజు మధ్యాహ్నం  భోజనం సమయంలో

రాత్రి తనకు వచ్చిన కల  వసుమతికి చెప్పింది జ్యోతి .

రెండు రోజులలో ఎవరూ తీసుకోక పోతే దానిని షెల్ఫ్ లోకి పెట్టేస్తారు .

అప్పటికి అమ్ముడు  కాక పోతే  సేల్ లో పెట్టేస్తారు .అపుడు సగం రేటుకు ఇస్తారు .మనకు కావాలంటేఅపుడు మేనేజర్ గారిని బతిమాలి కొనుక్కోవచ్చు చెప్పింది వసుమతి.

సగం రేటైనాఎక్కువే మనం కొనుక్కోలేము బాధ గా అంది జ్యోతి.

ఒక పని చేయవచ్చు కస్టమర్స్ బ్యాగ్స్ కార్ దగ్గరికి తీసుకెళ్ళినపుడు టిప్‌లు  ఇస్తుంటారు కదా అవి నెల నెలాపాకెట్ మనీ క్రింద ఇచ్చే డబ్బులు దాచి

ఇంకా ఇవ్వాల్సి వుంటే సర్‌ని నెల నెలా కొంత జీతంలో తీసుకోమనొచ్చు చెప్పింది  వసుమతి

అమ్మో అలా వద్దు అప్పు అంటే నాకు భయంతండ్రి చేసిన అప్పుల కోసం అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చిచేసే గొడవ గుర్తుకు వచ్చి కంగారు పడిపోయింది జ్యోతి .

రెండు నెలలనుండి అమ్మకు తెలియకుండా దాచినవి 1000/వున్నాయి .

ఆలోచిస్తున్న  జ్యోతిని చూస్తే వసుమతి కి చాలా జాలేసింది

ఎవరూ తీసుకో పోతే అపుడు ఆలోచిద్దాం పద టైమయింది అంటూ అప్పటికి విషయాన్ని మార్చేసింది .

వసుమతి అన్నప్పటినుండి మనసు పదే పదే దాని మీదకే పోతుంది.

కావాలనే ఆశ పెరుగుతుంది. అంతర్జాతీయ సమస్యలా జ్యోతి మనసును ఆక్రమించుకుంది తనకు తనేసముదాయించుకుంది.ఎవరూ తీసుకోక పోతే అపుడు చూద్దాం అన్న వసుమతి మాటలు గుర్తు కొచ్చివూరకుండి పోయింది.డ్రస్ మార్చటానికి ఇంకా కొన్ని గంటలే వుంది.ఎవరూ తీసుకోకుండా వుంటేబాగుండును అనే ఆలోచన కూడా వచ్చింది.

కస్టమర్ లోపల కొచ్చినా జ్యోతి ముఖంలో అలజడి కనిపిస్తుంది .

డ్రస్ లు మార్చే కార్యక్రమం మొదలు పెట్టారు .నీలి రంగు లంగా ఓణీ  మార్చి వేరే డ్రస్ వేసారు. డ్రస్ నుచక్కగా మడత పెట్టి షెల్ఫ్ లో అన్ని బట్టలతో పాటు పెట్ట మన్నారు .షెల్ఫ్ లో వేరే బట్టల మధ్యగా పెట్టి జ్యోతిఊపిరి పీల్చుకుంది .

సేల్ పెట్టేవరకు  దానిని ఎవరూ కొనకుండా వుంటే బాగుంటుంది  అని పలు సార్లు అనుకుంది. రోజంతాడబ్బులు ఎలా కూడ పెట్టాలి ఎంత కూడపెట్టాలి అనే విషయమే చర్చించుకున్నారు  జ్యోతి , వసుమతి

అంతగా అయితే ఇద్దరు కలిసి కొనుక్కుందామనే నిర్ణయానికి కూడా వచ్చేసారు జ్యోతి కి నీలిరంగు లంగా,సొంతం చేసుకున్నంత ఆనందంగా వుంది . ఆలోచనే గమ్మత్తుగా వుంది .

లంగా జ్యోతి కొనుక్కుందా .ఇద్దరు కలిసి కొనుక్కున్నారా లేదా లోపు వేరెవరైనా కొనుక్కున్నారా ఇంకాఏమైనా జరిగిందా దాచుకున్న డబ్బులు వాళ్ల నాన్న తాగుడుకు తీసుకు పోయాడా ఎవరైనా కాజేసారా ఇంకదేనికైనా ఖర్చు అయినాయా ఎలాంటి ముగింపైనా చెప్ప వచ్చు .ముగింపు ముఖ్యం కాదు నా కధకు.

అనుకున్నట్లుగా. సేల్ పెట్టారు వారం రోజులు  సేల్ జనం బాగా వచ్చే వారు .

నీలి లంగా కూడా అందులో పెట్టారు .కొంత మంది ట్రయల్  చేసి వదిలేసారు

సేల్ అయిపోయింది .టిప్ డబ్బులు కూడా బాగానే వచ్చాయి .అవి ఇంకా పంచ లేదు .ఆడబ్బులన్నీ రాణిదగ్గర వుంటాయి .వారానికి ఒక సారి అందరికీ సమానంగా పంచుతుంది .నీలి లంగా మిగిలి పోయింది .వారం ఎక్కువ పనిచే సినందుకు  అందరికీ 3000 రూ .అదనంగా ఇచ్చారు . డబ్బు సంగతి వసుమతిసూచనతో ఇంట్లో చెప్పలేదు జ్యోతి . డబ్బులు చేతిలో తీసుకున్న దగ్గరనుండి జ్యోతి మనసు అలజడి గావుంది . తమ్ముడు ,తల్లి గుర్తొచ్చారు

తల్లి కొత్త చీర కట్టు కోగా తను చూడలేదు .తమ్ముడికి అంతే ..వూళ్ళో వాళ్ళు ఇచ్చే బట్టలే. తండ్రి కూడా అంతేకాక పోతే తాగి గొడవ చేసి తల్లిని కొడతాడని కోపం .ఇంత ఖరీదు పెట్టి ఎదురు అప్పు చేసి కొని డ్రస్ తనుఎపుడు వేసుకోవాలిఇంట్లో అందరూ పాత  బట్టలు వేసుకుంటే

తనొక్కతి అంత ఖరీదు బట్టలు ఎలా వేసుకోగలదు .అయినా డ్రస్ దాచుకునేందుకు కూడా తన ఇంట్లో  పెట్టెలు బీరువాలు లేవు .ఎందుకు పిచ్చిగా ఆశ పడ్డాను అనుకుంది.జ్యోతి ఒక నిర్ణయానికి వచ్చింది .తనకు డ్రస్ వద్దు . డబ్బులతో ఇంట్లో అందరికీ బట్టలు కొనాలి అనుకుంది .

పద మేనేజర్ సర్ వెళ్ళి పోతారేమొ అడుగుదాం  అంటూ వచ్చింది వసుమతి .

వద్దు అంటూ వసుమతి చేయి పట్టుకు ఆపింది జ్యోతి .

అదేంటి ?అంటూ ఆశ్చర్యంగా చూసింది వసుమతి ..

ఇన్ని రోజుల నుండి అంత ఆశ పడ్డావుకదా!మేనేజర్ సర్ ఒప్పుకోరనా !వసుమతి

కాదు నేనే వద్దనుకుంటున్నాను .నాకు ఒక సాయం చేస్తావా!తక్కువ రేటులో బట్టలు దొరికే  షాపుకుతీసుకెళుతావా!నాకు తెలియదు ఎక్కడ వుంటాయో అడిగింది జ్యోతి.

అదేంటి ఎవరికి  ?అడిగింది వసుమతి ..

తమ్ముడికి అమ్మకి నాన్నకి  తీసుకుంటాను వస్తావా !సర్‌ని  పర్మిషన్ అడిగి కొంచెం ముందుగా వెళ్దాం అందిజ్యోతి.

అలాగే అంటూ తలవూపింది వసుమతి. ఏమి అర్ధం కావటం లేదు .సడన్ గా ఎందుకు మార్చుకుంది .

ఇద్దరు పర్మిషన్ తీసుకుని షాపు బయటకు వచ్చారు .

అపుడు చెప్పింది. అంత ఖరీదు గల డ్రస్ అప్పుచేసి కొన్నా నేనొక్క దాన్నే వేసుకుంటాను .అది దాచుకునే ప్లేస్కూడా మాఇంట్లో లేదు .నా మనసు ఒప్పు కోవటం లేదు .తమ్ముడికి కూడా సరైన బట్టలు లేవు .వాడుస్కూల్‌కి వెళుతున్నాడు .వాళ్లెవరికీ లేకుండా  నా కోసం  కొనుక్కోవటం ఇష్టం లేదు అందుకే అందరికీకొందామనుకుంటున్నాను.సగటు ఆడపిల్ల ఆలోచన అది.

మాట తో వసుమతికి జ్యోతి ఏమిటో అర్థమయింది .స్నేహపూర్వకంగా

మెచ్చి కోలుగా  జ్యోతి చేయి నొక్కింది .

మంచి పని చేస్తున్నావు.నేను కూడా మా అమ్మకి నాన్నకి తీసుకుంటాను .

వసుమతి  వాళ్ల అమ్మ నాన్నకి  ఒక్కతే కానీ  చాలా పెద్ద కుటుంబం  నాయనమ్మ ,తాతయ్య మేనత్తలు .చాలాబాధ్యతలు కల కుటుంబం .

వాళ్లందరికి వసుమతి తండ్రి మాత్రమే ఆధారం .ఒకళ్లకి  తీసుకుంటే ఒకళ్ళ తో గొడవ .అయినా సరే అమ్మ కినాన్నకి తీసుకోవాలని నిర్ణయించుకుంది .

ఇద్దరు కలిసి షాపింగ్ చేసారు . అందరి బట్టలతో పాటు వాళ్లిద్దరూ కూడా కొనుకున్నారు .

ఇంకా 700/ మిగిలినయి .బయటకు వచ్చారు స్వీట్స్ కొన్నారు.జ్యోతి  తమ్ముడికి ఒక పెన్సిల్ బాక్స్ కొన్నది . ఇద్దరు  పానీ పూరీ తిన్నారు .చెరుకు రసం తాగారు సరదాగా కబుర్లు చెప్పుకున్నారు .ఎప్పటికీ ఇలాగేస్నేహంగా వుండాలి అనుకున్నారు.ఇద్దరు బస్ ఎక్కి ఎవరింటికి వాళ్ళు వెళ్లారు.

జ్యోతి ఇంటికి వస్తూనే తను తెచ్చినవి తమ్ముడికి ఇచ్చింది .బట్టలు పెన్సిల్ బాక్స్ చూస్తేనే వాడి కళ్ళల్లో  కనిపించిన సంతోషానికి  దీపావళి వెలుగులు సరి రావు .వాడి సంబరం చూసిన జ్యోతి మనసుకి చాలాసంతోష మనిపించింది .అలాగే తల్లికి చీర స్వీట్ బాక్స్ ఇచ్చింది .అవి చూస్తూనే

కేకలు వేయటం మొదలు పెట్టింది .డబ్బులన్ని పాడు చేసావు . ఎందుకు కొన్నావు .గొంతు మీద అప్పులుపెట్టుకుని .

జ్యోతి ఏమి మాట్లాడ లేదు కాసేపు అరిచి .చీర చేతిలో పట్టుకుని తిప్పి తిప్పి చూసుకుంది .కొత్త చీర కొనుక్కునిఎన్ని సంవత్సరాలయిందో ! అంటూనే  తండ్రిని తిడుతూ స్వీట్లు తీసి పిల్లలిద్దరికి ఇచ్చింది .

కాసేపటిలో తండ్రి రానే వచ్చాడు రోజు ఎందుకో మామూలుగా వున్నాడు .

తండ్రికి  బట్టలు ఇచ్చింది అర్ధంకానట్లు చూసాడు . తను చెప్పే లోపే తల్లి డబ్బు లన్నీ  ఇలా తగల పెట్టిందిఅంటూ  అరుస్తున్న  పెళ్ళాన్ని

యహ్ఆపు అంటూ గట్టిగా అరిచాడు.

బట్టలు పట్టుకుని చూసుకున్నాడు .ఎక్కడో తండ్రి కళ్ల ల్లో సన్నటి నీటి పొర కరిపించింది జ్యోతికి .తన చేతిలోవున్న మిగిలిన 300 రూ తండ్రి చేతిలో పెట్టింది . కాసేపు డబ్బులెంక చూసి  అందులో రెండు వందలు  జ్యోతి చేతిలో పెట్టి.వుంచుకోలే !షాపు కెళ్తావుగా ఏమైనా కొనుక్కుని తిను .

అంటూ 100 రూ. తీసుకుని బయటకు వెళ్లాడు.ఇక అర్ధ రాత్రికి వస్తాడు .మొగుడి పైన గొణుగుతూనే వుంది  యాదమ్మ .రవి పెన్సిల్ బాక్స్ చూసుకుని మురిసి పోతున్నాడు .అన్నం తిని పడుకున్నారు .యాదమ్మ ఇంకాకట్టవలసిన అప్పుల గురించి మాట్లాడుతూనే వుంది .

రవి పెన్సిల్ బాక్స్ పక్కనే పెట్టుకుని నిద్రపోయాడు .

జ్యోతికి మనసు చాలా తేలిక గా అనిపించింది .తొందర పడి డ్రస్ తీసుకోలేదు.లేకుంటే ఇంత ఆనందాన్నికోల్పోయే దాన్ని .తను తీసుకున్న నిర్ణయం సరైనదే అనుకుంటూ ఎంత కష్టపడైనా తమ్ముడిని బాగాచదివించాలి. ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా తమ్ముడి మీద చేయి వేసి కళ్ళు మూసుకుంది .అపుడువసుమతి గుర్తు వచ్చింది .వాళ్లంట్లో ఏమి జరిగిందో రేపు కనుక్కోవాలి అనుకుంటూ నిద్రలోకి  జారింది.

ఎపుడు వచ్చాడో తిరుపతయ్య.పిల్లల మీద చినిగిన దుప్పటి

సరి చేసి కప్పుతుంటే మెలుకువ వచ్చింది జ్యోతికి .

మా నాన్న మంచోడే తాగుతాడు అంతే  అనుకుంటూ పక్కకు తిరిగి పడుకుంది .జ్యోతి పెదవులపై ఒకనవ్వుమెరిసింది . ప్రశాంతంగా నిదుర పోయింది .

సగటు ఆడపిల్లల అంతరంగం ఇదేబాధ్యతల మధ్య బంధాల మధ్య

కన్న వారి తో వున్న అనుబంధం ఎపుడూ అభిమానంతో అరవిందం లా వికసిస్తూనే వుంటుంది . మమతనిండిన మనసెపుడూ  తన వాళ్ళ కష్ట సుఖాల మధ్య కాలం తో పాటుగా కదలాడుతూ నే వుంటుంది.మనిషి ఆడ పిల్లైనా  మనసు ఎపుడూ ఈడ పిల్లే

అదే ఆమె బలము , బలహీనత కూడా !!

About the author

vgadmin

Add Comment

By vgadmin
Language