చలువ పందిరి

శుభోదయం 🌹🌹🌹🌹🌹

ఆత్మీయ పదాలు ..”చలువ పందిరి “ చల్లదనం

*చలువ పందిరి ఆపేరే చాలా ఆహ్లాద కరంగా వుంది .
మండు టెండలో పచ్చి తాటాకుల పందిరి క్రింద, సాయంత్రం సన్నజాజి పందిరి క్రింద , సేద తీరినంత మనోహరంగా వుంది .
పేరుకు తగ్గ ముఖ చిత్రం తో సంపుటి ఆకర్షణీయంగా వుంది .
వెంకటేశ్వర్లు గారు FB లో గత కొద్ది సంత్సరాలుగా పరిచయం.ప్రతి రోజు ముఖ పుస్తకానికి ధన్యవాదాలు చెపుతూ కవిత వ్రాస్తారు .చాలా ఆత్మీయంగా మాట్లాడుతారు .సాహిత్యపు విలువలు తెలిసిన కవి.మనసున్న మనిషి .
విశ్రాంత ఉపాధ్యాయులు .
142 కవితలు పొందు పరిచిన ఈ సంపుటి
అనేకమైన భావ స్పందనలతో రచించిన నిజమైన “చలువ పందిరి”
ఇందులో స్పృశించని అంశం లేదు . వారి మనో స్పందనలకు ప్రతి స్పందనలే ఈ కవితలు ..చక్కని పదాల అల్లికతో ..మనసును హత్తుకుంటాయనేది నిస్సంశయం .
ఏడుకొండల స్వామి అంటే భక్తి , నమ్మకం దైవం మీద వ్రాసిన ప్రతి కవితలో కూడా అపారంగా కనుపిస్తాయి .ఒక్క స్వామి మీదే కాక రాముల వారి మీద కూడా చాలా భక్తిగా రాసారు .
“వచ్చిండూ వచ్చిండూ
వెంకన్న సామీ
ఏడుకొండలు దిగి
వచ్చిండూ వచ్చిండూ “ అంటూ స్వామి వైభవాన్ని మొదటి కవితగా వ్రాసారు .
“ రైతన్న హృదయం” లో అన్నదాత హృదయాన్ని అక్షరాలలో పొందు పరిచారు .
“నేను మళ్ళీ పుట్టాలి” అన్న కవితలో
“బతికున్నంత వరకు నేను రచనలు చేయాలి “
అది నెరవేరక పోతే నేనుమళ్ళీ పుట్టాలి”
ఈ వాక్యాలు చదివినపుడు సాహిత్యం మీద వారికున్న శ్రద్ధ , ఆరాధనా భావం
పాఠకుని కళ్ళకు గోచరమవుతుంది .నిజంగా తరచి చూసినపుడు వారి కవనంలో ఒక తపన కనిపిస్తుంది .
“మంచు పల్లకి “ “అనుమతి నివ్వవా” అంటూ వ్రాసిన అందమైన భావ కవితలు . “పసికూన” పసి పిల్లల పై అత్యాచారాలపై రాసిన కవిత
“ఇది బ్రహ్మ గీసిన గీతా
సమాజం లో కామాంధులు గీసిన గీతా ..” హృదయాన్ని కదిలిస్తుంది .
స్వార్థం లో నిండి పోయిన సమాజాన్ని “సమాజమా నీ దారెటు వైపు” అంటూ ఆర్తిగా ప్రశ్నిస్తారు .
“రమణీయ ప్రకృతి “ అంటూ వ్రాసిన కవితలో “ ఎంతైనా ప్రకృతి గొప్పది .
ఎంత వర్ణించినా తనివితీరదు అంటూ ..సుందరమైన ప్రకృతి దృశ్యాలను
మన కళ్ళకు చూపిస్తారు .
“లాల నీకు పోయనా” “వల్లంకి పిట్ట” బుజ్జి బుజ్జి పాపాయి అని పిల్లల మీద రాసిన కవితలు పిల్లలను ప్రేమించే వారి మనసు తెలుస్తుంది .
“కన్నీటి వీడ్కోలు “ పర్యావరణం మీద రాసిన కవిత వారి మానవత్వం చాటుతుంది.
“మానవ అహంకార పూరిత చర్యల వలన
మానవ మనుగడ బరువై
పిడికెడు కూడు కొరకు
ఆక్రోశించాల్సి వస్తుందేమా అని భయం “అంటారు .
నిజమే నేడు ఆ భయం అందరి గుండెల్లో గూడు కట్టుకుని వుంది ..ఇలాంటి సందేశాత్మక కవితలు ఈ సంపుటిలో చాలా వున్నాయి.
“రైతన్న “ ఆరు కాలాల కష్టం గురించి ఎంతో ఆర్తిగా రాస్తారు .
“నేనొక…” కవిత..
ప్రతి రాత్రి కామ దావానలంలో
“దహించుకు పోతున్న నా ఒడలుకు
చల్లని వెన్నెల కాంతిని పూసేదెవరు
కార్చిన కన్నీటి బొట్టు తో తడిసిన నేలపై
సరి కొత్త పూలమార్గాన్ని ఎవరు వేస్తారు “
ఒక వ్యభిచారిణి హృదయం పాఠకుని ఆలోచింప చేస్తుంది .
భావుకత , బాల్యం, ఓ పిల్లా అంటు అందమైన జానపదాలు …
స్నేహం ,ఇలా అనేకమైన అంశాలపై అద్భుతమైన కవితలు వ్రాసారు.
కరోనా సమయం లో “ ఎవరో వస్తారని ఏదో చేస్తారని “ కవిత
కరోనా రోగి మనసు బాధ అద్భుతంగా వర్ణించారు.
“అందని ఆక్సిజన్ అణువుల కోసం,
ఆరాటపడే ఊపిరి తిత్తుల ద్వయం
కాలం లోని ప్రతి క్షణం నా గుండెను
చీల్చుతానే వుంది .”
ఎవరో వస్తారని ఏదో చేస్తారనే ఎదురు చూపులు .ఆనాటి ఎందరో మనోవేదనకు అనుభవాల అద్దం పట్టారు .
142 కవితల గల సంపుటి ఎన్నో అంశాలపైన ఎంతో చక్కని అవగాహనతో చాలా బాగా రాసారు .నేను కొన్నిటిని మాత్రమే స్పృశించా ను.ప్రతి కవితా ఒక
ఆణి ముత్యం . అత్యుత్తమ అక్షర మాల .
చివరగా “నెత్తురు” శీర్షికన రాసిన కవిత
“అందరి నెత్తురు ఒకటే
అయినా కులాల పోరెందుకు
మానవత్వమే కులం
మంచి తనమే మతం “
ఇలాంటి చైతన్యాన్ని ప్రతి మనిషి పొందాల్సిన అవసరం వుందంటూ
సందేశం గా చెపుతారు .
ఈ సంపుటికి. ముందు మాటలు రాసిన వారి అభిప్రాయాలు వంద శాతం నిజం .తప్పని సరిగా చదవ వలసిన సంపుటి ఈ “చలువ పందిరి “
శ్రీ వెంకటేశ్వర్లు గారు ఇలాంటి కధా సంపుటాలు మరెన్నో అచ్చు వేయాలని
వారి కలం నిర్విఘ్నంగా ..సాగుతానే వుండాలని హృదయ పూర్వకంగా కోరుకుంటూ
అభినందనలు , శుభాకాంక్షల తో… .💐💐💐💐💐
ఇట్లు
గజల్ రచయిత్రి
విజయ గోలి
9704078022
పుస్తకాలు కావలసినవారు-:
తుపాకుల వెంకటేశ్వర్లు గారు
9866289833 సంప్రదించండి

About the author

vgadmin

Add Comment

By vgadmin
Language