గతవైభవ స్మృతి ఛాయలు

గత వైభవ స్మృతి ఛాయలు …………రచన……విజయ గోలి——————————————————–

స్వర్ణయుగపు పునాదులపై  ..
దేశమాత కు సమాధి కడుతున్న ..
వర్తమానం తలుచుకుంటూ ,…భవిత నుహించలేక
మూసిన నా కనురెప్పల  వెనుక  కదులుతున్నాయి
నా తల్లి  గత  వైభవ..స్మృతి  ఛాయలు …

కోటిసూర్యుల  ధీటుగా వెలుగుచున్న నా తల్లి,
వేదభారతి  రూపం నా కనుల నింపుచున్నాయి.
కాశ్మీరము నుండి  కన్యాకుమారి వరకు
విస్తరించిన ఆ తల్లి విశ్వరూపము.

పుడమి  విరిసిన హరిత  వర్ణాలు
అమ్మ మేనికి అందాల  నలముతున్నాయి .
జాలువారు నదీ నదముల జలధారలు
అమ్మకు  సిగ పాయలై  అలరుచున్నాయి .

ముత్యాల ముగ్గు  లో  దిద్దిన నీలాల మెరుపులు,
నింగినంటి  జలతారు తీగలయి దిగి వచ్చి,
అమ్మ మేనుకు అంబరముగా అల్లుకున్నాయి .
హిమనగముల వెలుగు ,వజ్ర కిరీటమై వెలయ ,
కాశ్మీరు అందాలు అమ్మ నుదుటన
అరుణ బింబమై అలరుచుండే

అలనాటి  హస్తిన వైభోగామంతా
అమ్మ  ముక్కెర గా మెరయుచుండే .
భాగ్యనగరపు శోభ  నడుమ
వడ్డాణమయి నిలిచియుండే ,
విజయనగరపు  జయహేల
అమ్మ గళమున మాలగా అమరియుండే.
కనకపీఠమై  కన్యాకుమారి వొదిగి
నిలిచెను అమ్మ పాదాలచెంత .

సస్యశ్యామల నా తల్లి
వెండి జాబిలి వలె వెలుగుచుండే,
వాసిగల రత్నాలు రాశి
పోసినయట్లు నవ్వుచుండే.
కరుణ నిండిన  ఆ కనులు
కనకరాశుల వలె తోచుచుండే.

ఆరబోసిన  రతనాలు  ..
.శ్వేతవర్ణపు నీరెండలో ,
సప్తవర్ణాల హరివిల్లుగా.. భారతాంబకు ..
భక్తి  నీరాజనాలెత్తుచున్నాయి…
భారతావని సకల చరాచరములు  గళమెత్తి  ..
అమ్మకు …జయగీతికలు పాడుచున్నాయి .

కనులనిండిన ఈ అపురూపం , కరిగిపోతుందేమో
మదినిండిన ఈ భాగ్యం జారిపోతుందేమో ,
కలవరముతో ….రెప్పలు  …విప్పలేకున్నాను ….

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language