“కవి. విజయ గోలి
రవి చూడని రంగు లెన్నో
కవి కాంచును కన్నులార…
చీకటిలో చిరు వెలుగులు
నీడలలో దాగిన నిజాలు
వెలుగు చూడని వేదన లెన్నో
కవి గుండెల చప్పుడవును .
కవి అంటే అక్షరాల కాగడా
చైతన్యపు చందనాల తెమ్మెర
కాగితాల పై కలలు నింపి
సాకారపు దిశ కు నడుపు దివిటీ
ఉద్యమాల ఉద్రేకపు నినాదం
చరిత్ర చెక్కే శిల్పాలకు ఉలి తానే
విశ్వమంతా కాంతి పంచు
కర్మ సాక్షి కి లేని ప్రాంతీయత
కావ్యాలతో కాలానికి శాంతినిచ్చు
కవి కెందుకు ప్రాంతీయ వివక్షత
కులమతాల కుళ్ళు నీళ్ల
కవి నెందుకు ముంచుతారు ?
ఎర చూపే మిఠాయి పొట్లాల
వల పెద్దది తెలుసుకుంటె
మహాకవికి సన్మానం
అద్దంలో మనసు పైన
మాసిపోని మాయ మరక
కొనుక్కునే ప్రసంశలకు
కొలమానం ఏమిటి .
సాహిత్యం అంత్య దశ లొ
ఆత్మాహుతి చేయనుంది
సామాజిక దృక్పధం మారుతుంది
కవికి కవిగా పట్టమిస్తే కాలం లో నిలిచి పోవు
రవి కిరణపు కాంతి శరముల పదును పెంచు ..॥