కనురెప్పల కలత పూసి

శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
కనురెప్పల కలతపూసి నిదురమ్మను రమ్మంటే వచ్చేనా!
గట్టుతెగిన నదులెపుడూ పొంగిపోక ఆగమంటె ఆగేనా!

కనులుండీ కలలులేక మనసుండీ మమత లేక బ్రతుకేమిటి?
ఎద ఊసులు ఎరుకైతే ప్రేమరధం అసలు పధం మారేనా!

చితి చింతలు ఏదైనా కాల్చడమే మారపోదు దాని గుణం
దరహాసం అద్దిననూ వెతలెపుడూ దహియించక మానేనా!

సౌధంపై మెరిసినంత సొంతమెవరికి కాబోదులె వెన్నెలమ్మ!
అలుపుతీర అడవంతా చల్లదనం కప్పుకొనక సాగేనా!

మృత్యువునకు ముందైనా జీవించుము ఒక్క రోజు జీవితాన్ని!
బతుకు తీపి బంధమేదొ చెప్పకనే సమయం చేజారేనా!!

About the author

Vijaya Goli

Add Comment

Language