ఏమో గుర్రం ఎగరా వచ్చు …

శుభోదయం 🌹🌹🌹🌹🌹
“ఏమో …గుర్రం ఎగరా వచ్చు “ విజయ గోలి

ఎవరో స్వేఛ్చా గీతం పాడుతున్నారు
భరించ లేని బండ గొంతులతో
చెవుల్లో గింగిరాలెత్తే హోరు
కాళ్ళకు చేతులకు చుట్టుకున్న సంకెళ్ళ తో
నిస్సిగ్గుగా స్వేఛ్ఛాలాపన చేస్తున్నారు

ఎదుగుతున్న రెక్కలు కత్తిరించి
ఎడారిలో వదలి స్వేచ్ఛ అంటున్నారు
రాబందులు రగిల్చిన యజ్ఞం లో …
సమిధలై మిగిలిన బూడిదకు
సమాధులు కడుతూ సెల్యూట్ చేస్తున్నారు .

ప్రశ్నించే గొంతుల్ని
కర్కశంగా నులిమేస్తున్నారు
కరాళ నృత్యం చేసే కామాంధులు
చితి కి కూడా చీడ పట్టిస్తున్నారు
కలి కాలపు కాలుని రాజ్యం కదా..సమర్థింపు

తీతువులతో పోటీ పడుతూ
మిణుగురులను సైతం ముక్కులతో పొడిచి
చిరువెలుగులు చిదిమి
చీకటిని చిరస్థాయిగా నిలిపే ప్రయత్నంలో
సూర్యుడి గృహనిర్భంధ ప్రణాళిక కు శ్రీకారం..చుట్టేసారు.

ఏమో …గుర్రం ఎగరా వచ్చు ..చీకటి స్వారీ చేయా వచ్చు

About the author

vgadmin

Add Comment

By vgadmin
Language