శుభోదయం 🌹🌹🌹🌹🌹
అచ్చు నీలాగే….విజయ గోలి
నడి రేయి వెన్నెల వనాల
మాయని పరిమళ మొకటి
మనసు తలుపు తట్టింది
తలపు మేఘాల తెరలు తీసి
వలపు రాగాలు మీటింది…
అచ్చు నీ లాగే…
పాలపుంత దారులలో
వెండి పూల జల్లులో
తడిచిన తపనల వూసులెన్నో
గుసగుస లాడిన చిరుగాలి …
జోల పాట విరుల నేస్తమయ్యింది
మనసంతా మధురాలను నింపుతూ …
కల వరమైనా కలవరమైనా
కరిగి పోయిన కాలమిచ్చిన
కానుకగా నీజ్ఞాపకాలు
కంటి పాపలకు చెలియలికట్ట గ
కాటుక రేఖల కాపలా కాస్తున్నాయి
ఎదురు చూపు ఎద సవ్వడి గా మారింది .
వేకువ వెలుగు కిరణంలో
ఆత్మీయంగా స్పర్శించే చల్లని గాలి
భుజం మీద చేయి వేసి
ఎదురు లేని విశ్వాసం నింపుతుంది
అచ్చు నీలాగే…ఎదిగి పొమ్మంటూ…
ఇది చాలని పిస్తుంది ..
చూస్తున్నావు కదా…