అంతరంగం. విజయ గోలి

మిత్రులకు శుభోదయం 🙏🏻ఎప్పటినుండో కధ వ్రాయాలనే నా ప్రయత్నం……

ఇన్నాళ్ళ కి మొదలుపెట్టి పూర్తిచేసాను.చదివి మీ అభిప్రాయాలు చెప్పవలసందిగ

కోరుతున్నాను.దీనికి పేరు కూడా పెట్టలేదు.తగిన పేరుకూడ చెపితే ఆనందం..

విజయ గోలి. 🙏🏻🙏🏻🙏🏻

నా పేరు స్వప్నిక….అందమైన పేరు అంటూవుంటారు అందరు …నిజంగా…కలల ప్రపంచం ..ఎపుడు ..ఏడు రంగుల ఇంద్రధనస్సు లాగా అందంగా ఆహ్లాదంగా బాగుంటుంది ..అందులో అన్ని మనమే …మనకిష్టమైన రీతిలో కనురెప్పల వెనుక కదలాడే కలలతో ..అలౌకికమైన ఆనందావస్థ ….అందుకే ఆ పేరు పెట్టరేమో…మా అమ్మ..నాన్న ..
సరే అసలు విషయానికి వస్తే…చందమామ కథలోలా రాక్షసుడు రాజకుమారిని దాచి పెట్టే ఒంటిస్తంభం మేడలాంటి.. అద్భుతమైన బంగారు భవంతిలో బందీ ఐన మహారాణి ని .మహారాణిని అని ఎందుకన్నానంటే …నేను శ్రీమతిని…కాకపోతే ..నా జీవితంలో రాక్షసులు ఎవరూ లేరు….
సంతృప్తి ,సర్దుకు పోలేని నా మనసే నా పాలిటి రాక్షసి…ఇప్పటికే …నా గురించి మీకు అర్ధమై ఉంటుంది….అందమైన ,పేరు,ప్రఖ్యాతులున్న వ్యాపారవేత్త ..నా భర్త….ఎపుడు ఏ దేశం లో వుంటారో తెలియదు…అందమైన పాలరాతి బొమ్మలాంటి పదహారేళ్ళ కూతురు…అందరి శ్రీమంతుల పిల్లల లానే విదేశాలలో …విద్యా విహారం చేస్తుంది .రోజు మొత్తంలో ఎపుడో ఒకసారి …హాయ్ మామ్ ….అంటూనే …అది పూర్తైయ్యే లోపు బాయ్ మామ్ అంటుంది ..అందరి శ్రీమంతుల భార్యల లాగే…ఉన్నతమైన క్లబ్బుల్లో ..పెద్ద.. పెద్ద…సభ్యత్వాలున్నాయి …కానీ ఈ పరదాల వెనుక అతి సామాన్యమైన ఒక ఆడపిల్ల మనసుంది ….అదే .. నా అసంతృప్తికి కారణమేమో…..నియాన్ లైట్ల మెరుపులకంటె …చల్లని వెన్నెల ప్రశాంతత కావాలనే మనసు నాది …
ఉరుములు మెరుపులతో పెద్దవర్షం…ఎక్కడో పిడుగు పడిన శబ్ధం..మేడ మీద మా గదిలో నుండి మూడు నిమిషాల నడకతో …వరండాలోకి వచ్చాను …చాలా పెద్ద పాటియో…ఒక కుర్చీ లాగి రోడ్డు కనపడేలా కూర్చున్నాను… తడిచిన మొక్కలు బరువుగా తలలూపుతూ ….రాలిన పూలనుండి వాసనలు అంతటా పరుచుకుంటూ మధ్యాహ్నం రెండు గంటలైనా …వాతావరణం చాలా ఆహ్లాదంగా వుంది ..మావారు ఇంకా భోజనానికి రాలేదు వస్తారో రారో తెలియదు …నేనిలా కూర్చున్నందుకు మా వారు చూస్తే…చాలా నొచ్చుకుంటారు….స్టేటస్ మైంటైన్ చేయటం లేదని ….ప్రక్కనే వున్న ఫోన్ మ్రోగుతుంది ….ఫోన్ చూసినపుడు గూగుల్ మ్యాప్ లో అది కొన్న లొకేషన్ …దాని ప్రైస్ టాగ్ కనిపిస్తాయి..ఇంట్లో ఏ వస్తువు చూసినా నాకు అలాగే అనిపిస్తుంది …..ఈ మధ్య నాకు కాస్త ఒంట్లో (మనసు)బాగాలేదని ఏ వ్యాపకాలు పెట్టుకోకుండా ఇంట్లోనే ఉంటున్నాను..ఎలా ..ఉన్నానో …కనుక్కుంటూ …భోజనానికి రావటంలేదని …సాయంకాలం పెద్ద పార్టీ ఉందని రెడీగా ఉండమని ….ఆ ఫోన్ సారాంశం ….
ఈ మధ్య ఇలా కూర్చొనిమాప్రహరీ ….ప్రక్కనేఉన్నకుటుంబాన్నిచూడటంఅలవాటైంది….నిజానికి ..నేను ఈఇంటికి రావటానికి ముందునుండే …ఆ కుటుంబం అక్కడ ఉంటుంది….. మా ఇంటికి తూర్పు వైపున వున్నందువలన …మా స్థలంలో ..కలుపుకోవటానికి …మా వారు చాలా ప్రయత్నాలు చేసారు …ఐనా రాజమ్మ ససేమిరా ..ఇవ్వనంది…పెద్దలు ఇచ్చింది …నా బిడ్డకి …అమర్చుకునే తెలివి లేదు. ..తిన్నా ..తినకున్న ..గూట్లో పడివుంటారు …నా ప్రాణం వున్నంతవరకు…అమ్మనంది…చేసేది లేక ..మిన్నకున్నారు …మా వారికి ..ఉన్న అసంతృప్తి ..పక్కన ఉన్న రాజమ్మ ఇల్లు…
ఎప్పటికైనా …దానిని అమర్చుకోవాలనే ..ఆశ …
ఆ కుటుంబం సాధు బాబుది…సాధు బాబు పేరుకుతగ్గట్లు ..చాల సాధువు …సొంత ఆటో నడుపుకుంటూ ఉంటాడు … అతని తో తల్లి రాజమ్మ ,భార్య
నాగి ,అతని కూతుళ్లు ముగ్గురు …ఆడపిల్లలు …పెద్దపిల్ల పేరు రాజకుమారి …చిన్న రాజమ్మ అని పిలుచుకుంటారు .ఆపిల్లకి 10 సంవత్సరాలు..దగ్గర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో ఆరవ తరగతి చదువుతుంది ..రెండవది సీతాకుమారి …..ఎనిమిది సంవత్సరాలు …సీతయ్య సాధు బాబు నాన్న పేరు..మొగపిల్లోడని ఆ పేరు పెట్టాలనుకున్నాడు …ఆడపిల్ల పుట్టేసరికి సీతాకుమారిగా పెట్టేసాడు …ఆపిల్లని సీతయ్యనే పిలుస్తారు …ముచ్చటగా మూడవసారి కూడా ఆడపిల్లే పుట్టింది …ఇంకా ఆలోచించకుండా నాగికి ఆపరేషన్ చేయించేసాడు …చిన్నదానికి ఆరేళ్ళు …దాన్ని మాలక్ష్మి అనిపిలుస్తారు ..అది నాగి అమ్మపేరు …ఇలా పోయినోళ్లందరిని ..ఇంట్లోనే పెట్టేసుకున్నాడు..సాధుబాబు తండ్రి కూలిపని చేసేవాడు ..తల్లి కూడాచుట్టుపక్కల ఇళ్లల్లో పనులు చేసేది ..పెళ్ళైన చాలా రోజులకి ఒక సాధువు దయవల్ల పుట్టాడని సాధుబాబు అని పేరుపెట్టుకున్నారు …అపురూపంగా పెంచుకునేవాళ్ళు ..ఒక యాక్సిడెంట్లో సీతయ్య చనిపోయాడు ..రాజమ్మ కుప్పకూలి పోయింది ..సాధు బాబుకి అపుడు పదిఏళ్ళు…చదువు అబ్బలేదు…రాజమ్మే కష్టపడేది ….వాడికి పదిహేను ఏళ్ళు వచ్చేవరకు స్కూలుకి పంపుతూ చదువుకుంటాడని ఎదురు చూసింది …అప్పటికి వాడు ఏడవ తరగతిలోకి వచ్చాడు …ఇంక కుదరదని ఒక షావుకారుని బ్రతిమాలి రోజు కూలికి ఆటో షెడ్ లో పెట్టించింది …అందులో బాగానే స్థిరపడ్డాడు ..చదువు రాలేదనే కానీ అల్లరి చిల్లరివాడు కాదు ..షావుకారు కూడా బాగా చూసుకునేవాడు …అక్కడే ఆటో నడపటం నేర్చుకున్నాడు …వాయిదా పద్ధతి మీద ఆటో ఇప్పించాడు …వాడికి ఇరవై వచ్చేసరికి నాగితో పెళ్లి చేసింది..
ఈ విషయాలన్నీ …నాకు మా ఇంట్లో వంట చేసే నందమ్మ ..చెప్పింది …నందమ్మ నాగికి ..ఎక్కడో …దూరపు చుట్టం …అందుకే ..నా ఆసక్తిని గమనించి …అపుడపుడు వాళ్ళ విషయాలను చెప్తూ ఉంటుంది.ఈ మధ్య ఇంట్లోనే వుంటున్నానేమో …వారిని గమనించటం ..ఒక దినచర్యగా మారింది … సాధుబాబు పెళ్లి టైం లోనే మేము అక్కడ ఇల్లు కట్టించుకుని వచ్చాము …పెద్దగా ఆకుటుంబంగురించి పట్టించుకోపోయినా..
అపుడపుడు నాగిని చూస్తుండేదాన్ని …కడిగిన ముత్యంలా చక్కగా ఉండేది .రాజమ్మ కోడలిని ..పనికి పంపేది కాదు..రాజమ్మే పనిచేసుకొచ్చేది …సాధుబాబు ఆటోవేసేవాడు ..పెద్దలనుండి వచ్చిన పెద్దలనాటి…చిన్న మిద్దె లాంటి గది..వుంది..వచ్చిన దాంతో బాగానే వుండేవాళ్ళు …సాధు బాబుకి…అమ్మ అంటే ప్రాణం …అలాగే పెళ్ళాం నాగి అన్నా..
మెల్లిగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పిల్లలు పుట్టారు …ఖర్చులు పెరిగినాయి …ఇదే వరసలో రెండేళ్ల క్రితం రాజమ్మకు పక్షవాతం వచ్చింది …ఆ సమయంలో సాధుబాబు అల్లాడిపోయాడు …
…ఎలాగో..కోలుకుంది కానీ …పని చేయలేని పరిస్థితి .మాట స్పష్టత పోయింది ….కర్ర వూతమైంది …చాలా డబ్బు ఖర్చయింది ..సాధుబాబు డీలా పడిపోయాడు …అత్త చేసే ఇళ్ల పని నాగి చెయ్యటం మొదలెట్టింది …అత్తను,పిల్లల్ని ,ఇంటి పని చూసుకుంటూ …. …. చాలాకష్టపడుతుంది …..ఇపుడు పెద్దపిల్ల స్కూల్ నుండి వచ్చి …నాయనమ్మను ,చెల్లెళ్లను చూసుకుంటది..చెల్లెళ్లను చదివిస్తూ …తాను చదువుకుంటూ ..చాలా చేదోడుగా ఉంటది ……ఆ పిల్లలను చూసినపుడు చాల ముచ్చటగా ఉంటుంది ..ఆ వయసుకి ఎంత బాధ్యతగా ఉంటుందో… .నాగి పని నుండి వచ్చి వంట చేస్తది ….ఎనిమిది గంటలకల్లా …సాధుబాబు ఆటో దిగుతాడు …నాగి వేడినీళ్లు పెడుతుంది …స్నానం చేసి వస్తాడు …తల్లిని నడిపించుకుంటూ తీసుకొచ్చి మంచం మీద కూర్చోపెట్టి ..తాను కూడా తల్లి పక్కనే కూర్చుంటాడు..ఈ లోపు నాగి ,పెద్దకూతురు ..వండిన గిన్నెలు కంచాలు అన్ని తెచ్చి పెడుతుంది…నాగి కంచాల్లో వడ్డిస్తుంది …అందరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ భోంచేస్తారు … అది చూసినపుడు చాల ఆనందంగా ఉంటది …మనసులో ఎక్కడో అసూయగా కూడా అనిపిస్తుంది ……భోజనాలు కానిస్తారు..తర్వాత పిల్లలు,రాజమ్మ లోపలికి వెళతారు…అక్కడే ఆమంచం మీదే సాధుబాబు పడుకుంటాడు .ప్రక్కనే నాగి కూర్చుంటుంది…ఇంటి సంగతులు ,కష్టాలు మాట్లాడుకుంటారు …ప్రస్తుతం రాజమ్మ ఆరోగ్యం పెద్దసమస్యగా మారింది..సాధుబాబుకి .. నందమ్మ చెప్పింది….పెద్ద డాక్టర్ల దగ్గరే చూపించాడని .స్థాయికి మించి ఖర్చు .. పెట్టాడని…. ఏమి పాలుపోని పరిస్థితి …ఇప్పటికే యాభైవేల వరకు అప్పులు చేసాడు …ఇల్లు అమ్మక తప్పదేమో అనిపిస్తుంది ….
కానీతల్లిఒప్పుకోదు ..చచ్చిపోవటానికైనా ..సిద్ధపడుతుంది …అమ్మటానికి ..ఒప్పుకోదు ..
ఇప్పటికి చేసిన అప్పు తల్లికి ..తెలియకుండా …చేసాడు …ఇది తల్లికి తెలియకుండా చెయ్యటానికి వీలుపడదు …అందులో తల్లి సంతకం కావాలి …దాని గురించే మొగుడు పెళ్ళాలు…తర్జన పడుతున్నారు . తెల్లవారి నందమ్మ ద్వారా తెలిసిన సంగతి ….ఖర్చు పెట్టి వైద్యం చేయించిన …పూర్తిగా నమ్మకం చెప్పలేమన్నారంట …డాక్టర్లు ….సాధుబాబు …బాగా డీలా పడిపోయాడంట…రెండు రోజులుగా ఆటో కూడా వెయ్యకుండా ..వాళ్ళ అమ్మ దగ్గరే ఉన్నాడని…అప్పుకోసం..అందరిని …అడిగాడని ….ఎక్కడ అప్పు పుట్టలేదని ….ఇంకా నాగి ,సాధు బాబు …కలిసి …మా వారి దగ్గరికి వద్దామనుకుంటున్నారని …చెప్పింది.నేను ఎందుకు అని అడిగితే…చెప్పుకొచ్చింది …కొంత డబ్బు స్థలం మీద అప్పు ఇస్తే
తర్వాత ఆ స్థలం మాకే అమ్ముతారని …ఆవిధంగా కాగితాలు వ్రాసి ఇస్తారని …అడగటానికి వస్తామన్నారు అని చెప్పింది .
ఆ సలహా తానే ఇచ్చానని చెప్పుకొచ్చింది ..
ఎందుకో మనసులో చాల బాధగా వుంది ..ఆ కారణంగా వాళ్ళు వస్తే …మా వారు ..చాలా ఆనందంగా డబ్బు ఇస్తారు …ఆ తర్వాత ..వాళ్ళని ఎంత త్వరగా ..అక్కడినుండి పంపటానికి రెడీ ఐపోతారు ..అదే నా బాధ …ఎన్నో సంస్థలకి …గొప్పకోసం …వ్యాపారంకోసం ,రాజకీయంగా లక్షలు ..లక్షలు ..ఖర్చు చేస్తారు .. కానీ మానవతా దృష్టితో ఒక పైసా ఇవ్వరు …ఆంతా వ్యాపారమే …నందమ్మ ఆ విషయం చెప్పిన దగ్గరనుండి …గుండెలో బాధంతా గొంతులో …గూడుకట్టుకున్నట్లుగా వుంది …ఆయన రెండు రోజుల కోసం …ఆస్ట్రేలియా వెళ్లారు ..
రేపు రాత్రికి కానీ రారు ….ఆలా ఆలోచిస్తూ కూర్చున్న నాకు …ఎంత సమయం గడిచింది తెలియలేదు …ధైర్యంగా ఒక నిర్ణయానికి వచ్చాను …దైర్యం అని ఎందుకు అన్నానంటే …
ఇక్కడ నన్ను అధిక్షేపించే వాళ్ళు ఎవరు లేరు …కొంతకాలంగా
నన్ను నేను మర్చిపోయాను …ఒక గొప్ప వ్యాపారవేత్తకు భార్యగా
ఒక ఉన్నత కుటుంబానికి కోడలుగా …ఒక స్టేటస్ సింబల్ గా మాత్రమే …నా ఉనికి ..అందులోనుండి ఒకసారైనా బయట పడాలనేది నా కోరిక ….అతి సామాన్యంగా ఆలోచించటమే నేరం ..అన్నట్లుగా మా ఇంట్లో వారి పద్ధతి …చిన్నప్పటినుండి అంతే …పుట్టింటి నుండి అత్తింటికి వచ్చాను …అంతే…అక్కడ ఇవే పరిస్థితులు ..నేను …..తీసుకున్న నా నిర్ణయం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది ..మనసంతా చాల తేలికగా అనిపించింది ….అలా చిన్న
కునుకు కూడాపట్టింది నందమ్మ పిలుపుతో ..లేచి టైం చూస్తే…సాయంకాలం ఐదు గంటలైంది …మళ్ళీ ఎదో అలజడి
ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చాను ….ఎక్కడో …
దాన్ని కప్పి పుచ్చుకునేందుకు …చాలా కష్టపడుతున్నాను ….బీరువా దగ్గరికి వెళ్లి తలుపుతీసి ..కొన్ని నోట్ల కట్టలు తీసి ఒక ..కవర్లో కు సర్దాను ఆ డబ్బు సాధుబాబుకు ఇవ్వాలని ….నిజమైన మానవత్వంతో …సహాయం చెయ్యాలనే …నా తాపత్రయం …అవసరం లేకపోయినా …గొప్పకోసం చేసే దానాలు నాకెపుడు ..తృప్తిని ఇవ్వలేదు …పైగా …నన్ను నేను
మోసగించుకున్న భావన కలిగేది….ఇంత చిన్న విషయానికి
ఎందుకు అంత ఎక్కువ ఆలోచిస్తున్నాను …నేను ఇచ్చే డబ్బుకు నేనెవరికీ లెక్కలు చెప్పక్కరలేదు …ఇంతవరకు ఎపుడు ఎవరికీ
నా మనసుకు నచ్చినట్లుగా ఏ సహాయము చెయ్యలేదు ..నేను
ఖర్చు పెట్టె దైనికి లెక్కలు అడుగకపోయిన …ఇలా నేను చేసే
సహాయాన్ని మాత్రం ఉపేక్షించరు… నా మనసుకు నచ్చినట్లు గా చెయ్యాలనేది ..నా స్వాభిమానాన్ని …చల్లపరచాలనేది…నా ఆంతర్యం…

ఆ కుటుంబంలో నాకు నచ్చింది…పెద్దవాళ్ళ దగ్గరనుండి…చిన్నవాళ్ల వరకు ..ఒకరి మీద ఒకరికి అంతు లేని ప్రేమ….బాధ్యత …బంధం….ఒక కుటుంబం…అరమరికలు లేకుండా ..ఆనందంగా వుండవలసినవన్నీ …ఆ కుటుంబంలో అల్లుకు పోయివున్నాయి…
పైన చెప్పిన వన్నీ …నాకు కొరతే….నా కొరతలన్నీ డబ్బు మేకప్ తో కొట్టుకు పోతుంది..

డబ్బు లేమివల్ల ఆకుటుంబంలో…. ఆనందం…అడుగంటుతందంటే….మింగుడుపడని బాధగా వుంది…నాకు మనశ్శాంతినివ్వని డబ్బు…ఒక కుటుంబాన్ని నిలబెడుతుందంటే …కొంత ఊరటగా వుంది … మనసుకు సర్ది చెప్పుకుని….హ్యాండ్బ్యాగ్ లో డబ్బు కవరు పెట్టుకుని….మెట్లు దిగి క్రిందికి వచ్చాను..ఒక నిమిషం నందమ్మకోసం చూసాను…ఎక్కడో వంటగదిలో వుంది…పిలవాలనుకున్నాను…కానీ అవసరం లేదనిపించింది….మెయిన్ డోర్ తీసుకుని…బయటకువచ్చాను…వెంటనే డ్రైవర్ పరుగెత్తుకొచ్చాడు…కారు తీయమంటారా…అంటూ…వద్దంటూ ..చేతితోనే సైగ చేస్తూ…వడివడిగా గేటువైపు నడిచాను…..నా వెనుక డ్రైవర్ ఆశ్చర్యకరమైన చూపులు నన్ను తాకుతున్నాయి…అది నాకు తెలుస్తూనేవుంది…..
వడివడిగా పక్క ఇంటి వాకిట్లో నిలిచాను..
అక్కడే చెట్టు క్రింద దిగాలుగ కూర్చుని వున్న నాగి సాధుబాబు ఒక్క సారిగ నిలబడి పోయారు..వారి కన్నుల్లో భయము దిగ్భ్రాంతి ..పోటీ పడుతున్నాయి నన్ను చూసి తడబడుతూ ..నిల్చున్నారు..మొదటగా నాగి తేరుకుని ..అమ్మగారు ..అంటూ ఎదురు పరుగెత్తుకు వచ్చింది ..అయ్యో పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదమ్మా…ఇలా వచ్చారు అంటూ కంగారు పడి పోయింది..ఆ వెనుకే సాధుబాబు వచ్చాడు…చేతులు కట్టుకుంటూ….అర్ధంకాని ఉద్విగ్నత వారి ముఖాల్లో కనిపిస్తుంది.నాకు మాట రాని పరిస్థితి…బాగ్ లోనుండి కవరు తీసి నాగి చేతిలో పెట్టబోయాను..చెయ్యి వెనుకకు తీసుకుంది…ఆశ్చర్యంగా చూస్తూ…నాగొంతు సర్దుకుంటూ…ఈ డబ్బుతో రాజమ్మకి వైద్యంచేయించండి..మీ స్థలంతో ఈ డబ్బుకు ఎలాంటి సంబంధంలేదు..తీసుకోండి అంటూ సాధుబాబు వైపు చేయి చాపాను ..అడుగు వెనుకకు వేశాడు సాధుబాబు భయంగా…వారి తడబాటు చూసాక వాళ్ళు డబ్బులు ఊరికే తీసుకోరని అర్ధమైంది
మీ దగ్గర వున్నపుడు తిరిగి ఇవ్వండి..ముందు అవసరం గడపండి అంటూ వివరించాక ..వారి ముఖంలో ఒకింత సర్దుబాటు కనిపించింది. నాగి చేతిలో కవరు పెట్టాను అస్పష్టంగానే అందుకుంది.ఇద్దరికళ్ళల్లో నీళ్ళు నిండుతున్నాయి..దణ్ణం పెడుతూ కాళ్ళ మీదకు వంగారు.. తప్పుకుంటూ…వెనుకకు తిరిగాను ..ఈ విషయమంతా ఐదు నిమిషాల కాలంలో జరిగి పోయింది.మనసు చాలా తేలికగా అనిపించింది..నేను మోయ లేని భారాన్ని దించుకున్న విశ్రాంతత..గేటు దగ్గర సెక్యూరిటీని డ్రైవర్ని చిరునవ్వుతో పలుకరించాను.. వాళ్ల ముఖాల్లో కనబడుతున్న ఆశ్చర్యాన్ని తగ్గిస్తూ.. మనసు దూదిపింజలా..వుంది…ఇలాంటి సంతోషం ఈ మధ్య కాలంలో పొందలేదు…సరాసరి గదిలోకి వెళ్ళి అద్దం ముందు నిలబడ్డాను..నవ్వుతున్న ప్రశాంతమైన నామనసు మాత్రమే అద్దంలో అగుపించింది

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language